మన టాలీవుడ్ హీరోల పరిస్థితి ఎలా ఉంటుందంటే అయితే అతి వృష్టి లేదా అనావృష్టి రకంగా ఉంటుంది. కులాలు, అభిమానుల మధ్య మనస్పర్ధలు కేవలం ప్రేక్షకులకే మాత్రం పరిమితమని, హీరోలందరూ తాము ఒకటేనని చెబుతూ ఉంటారు. ఇక 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై చిరు ప్రశంసలు, చిరు కుమార్తె పెళ్లి వేడుకలో బాలయ్య వేసిన డ్యాన్స్ అందరికీ తెలిసిందే. కానీ బయటకు ఒప్పుకోరుగానీ గతంలో బాలయ్యకు నాగార్జునకు, చిరంజీవికి మోహన్‌బాబుకు ఇలా పలువురికి మనస్పర్థలున్నాయి. పైకి ఒకటే అని చెబుతూ, ఒకరిపై మరోకరు సెటైర్లు కూడా వేసుకుంటూ ఉంటారు.
ఇక యంగ్‌హీరోల మద్య మాత్రం మంచి సుహృద్భావం ఉంది. పవన్ పెద్దగా కలవకపోయినా ఎన్టీఆర్, రానా, నాగచైతన్య, ప్రభాస్, మంచు విష్ణు, మంచు మనోజ్ , సాయిధరమ్‌తేజ్‌ల మద్య మాత్రం మంచి స్నేహం ఉంది. ఇక నాని అయితే అజాతశత్రువు. తనపనేదో తాను చూసుకోవడం, ఎవరితోనైనా ఇట్టే కలవడం ఆయన నైజం. కాబట్టి టాలీవుడ్‌లో ఆయనకు శత్రువులెవ్వరూ లేరు.ఇక ఆయన తాజాగా నటించిన 'నిన్నుకోరి' చిత్రం రేపు విడుదలవుతోంది.
తాజాగా ఈ చిత్రాన్ని సెలబ్రిటీల కోసం ఓ స్పెషల్ షో వేశారు.ఈ షో చూసిన యంగ్‌హీరో రానా అయితే ఎగ్జైట్ అయిమరీ.. ఇంత మంచి నటీనటులు కలిసి నటించిన ఈ చిత్రం అద్భుతంగా ఉంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫీల్‌గుడ్ మూవీ రాలేదని కితాబు ఇచ్చేశాడు. మంచు లక్ష్మి సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ కొందరు విమర్శకులు మాత్రం ఈ చిత్రానికి పబ్లిసిటీ చేయడం లేదని, దాని ఖర్చును తగ్గించే పనిలో ఇలా సెలబ్రిటీ షోలు వేస్తున్నారని, ఇలాంటి షోలను చూసిన వారు సినిమా ఎలా ఉన్నా పొగడటం కామనే అంటున్నారు.
దీనికి ఉదాహరణగా గతంలో మంచు లక్ష్మి నటించిన 'గుండెల్లో గోదారి' ప్రీమియర్ షో చూసిన వారు ఇది ఆస్కార్ లెవల్ సినిమా అని పొగిడినా, చిత్రం తేలిపోయి ఫ్లాప్ అయిన విషయాన్నిగుర్తు చేస్తున్నారు. మొత్తానికి మరో కొన్నిగంటల్లో రుచి తెలియనుండగా, ఇప్పుడు పొగడ్తలతో పనిలేదనే చెప్పాలి...!