తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు తమను తమ అభిమాన హీరో పట్టించుకోకున్నా, సెల్ఫీలు దిగేటప్పుడు వారు బూతులు తిట్టినా కూడా మన వీరాభిమానులు మొహం తుడుచుకుని వారి వెంటే పడతారు. కానీ ఎన్నారైలు అలా కాదు కదా..! వారు కోటీశ్వరులు, కావాలంటే సొంతగా సినిమాలు తీయగలిగిన వారు, పైగా బాగా చదువుకుని లక్షలు కోట్లలో సంపాదిస్తున్నవారు.
కాబట్టి ఇక్కడ అభిమానులను ట్రీట్ చేసినట్లే ఓవర్‌సీస్‌లో చేస్తే తీవ్ర విమర్శలు తప్పవు. ఇప్పుడు బన్నీ వ్యవహారం కూడా అలాగే ఉండటంతో ఎన్నారైలు మండిపడుతున్నారు. 'డిజె' యూనిట్ యూఎస్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో న్యూజెర్సీ నుంచి షికాగోకు ఓ స్పెషల్ చార్టెట్ ప్లైట్‌ని ఏర్పాటు చేసి ఓ కార్యక్రమం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి వద్ద టిక్కెట్ రుసుంగా 60డాలర్లను పోగుచేశారు. ఇక మధ్యాహ్నానికి షికాగో చేరుకున్న బన్నీ తనకు ఒక సరస్సు పక్కనే స్పెషల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తే కాదు.. కాదు.. నాకు స్టార్ హోటల్‌లో రూం కావాలని డిమాండ్ చేశాడట. తప్పని పరిస్థితుల్లో ఆ తెలుగు సంస్థ నిర్వాహకులు స్టార్ హోటల్‌లో రూం ఏర్పాటు చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి కూడా ఎన్నారైలను ఎదురు చూపులు చూసేలా చేసి రాత్రి 10గంటలకు తూతూ మంత్రంగా ఆ వేడుకలో కనీసం 20 నిమిషాలు కూడా మాట్లాడలేదట. ఏదో రివ్యూలు నమ్మవద్దని, పైరసీని ప్రోత్సహించవద్దని ప్రసంగించి ఎంతో దూరం నుంచి చార్జీలు, ఎంట్రీ ఫీజులు కట్టి వచ్చిన వారి పట్ల రుస రుసగా ప్రవర్తించడంతో ఎన్నారైలు బిత్తరపోయారంటున్నారు.
ఇక గతంలో మెగా హీరోలైన పవన్, చరణ్‌లు ఇక్కడకు వచ్చారని, వారు అందరికీ విష్ చేసి పర్సనల్‌గా మాట్లాడారని, పవన్ అయితే కెనడా నుంచి వచ్చిన వారి యోగక్షేమాలు కూడా తెలుసుకున్నాడని, కానీ బన్నీ తన కోసం వచ్చిన వారికి కనీసం విష్ కూడా చేయలేదంటూ ఎన్నారైలు విమర్శిస్తున్నారు.