తమిళనాడు ప్రజలది, ప్రేక్షకులది అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్న సంగతి అందరికీ తెలుసు. రాజకీయాలైనా, సాంప్రదాయాలైనా, జల్లికట్టు అయినా, సినిమాలయినా తమిళ తంబిలది సపరేట్ రూట్. వారు అభిమానిస్తే నెత్తిన పెట్టుకుని పాలాభిషేకాలు, మద్యాభిషేకాలే కాదు... ఏకంగా గుళ్లు కట్టి, వారి పేరు మీద అష్టోత్తరాలు, సహస్రనామాలు చేసి పూజిస్తారు. ఏదైనా తేడా వస్తే అంతే సంగతులు.
తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా తనది ఉంటే అతివృష్టి...లేకపోతే అనావృష్టి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. జయలలిత సినీరంగం నుంచి రావడం వల్ల, కరుణానిధి వంటి వారు కూడా సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారే కావడంతో వారి ఏలుబడిలో కోలీవుడ్‌కి వరాలు కురిపించారు. సినిమా టైటిల్ తమిళంలో ఉండి, సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్ వస్తే వినోదపు పన్ను రాయితీ ఉండేది. కాబట్టి ఆయా దర్శకనిర్మాతలే కాదు... హీరోలు కూడా తమ చిత్రాలకు తమిళంలో టైటిల్ ఉండేలా చూసుకుని తెలుగులో, ఇతర భాషల్లో టైటిల్స్ మార్చుకునే వారు. కొందరైతే 'రోబో' వంటి చిత్రాలకి 'యంతిరన్' అనే కొత్త పదాన్ని కూడా కనిపెట్టారు. ఇక సెన్సార్ వారిని మభ్యపెట్టి సినిమా ఎలాగా ఉన్నా క్లీన్ యూ తెచ్చుకుని లాభపడిన వారు కూడా ఉన్నారు.
కానీ నేడు జీఎస్టీ దెబ్బతో అన్ని ఎగిరిపోయాయి. ఇక తమిళ చిత్రాలకు కూడా '2.0', ' స్పైడర్' లే పెట్టేస్తున్నారు. మరోపక్క తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీతో పాటు తమ రాష్ట్రంలో అదనంగా మరింత పన్ను విధించింది. దీంతో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రా, కేరళ, కర్ణాటకలలో 100రూపాయల టిక్కెట్ దాదాపు 120కి చేరనుండగా, తమిళనాడు మాత్రం ఏకంగా 100 రూపాయల టిక్కెట్ 150కి పెరగనుంది. దీంతో సోమవారం నుంచి థియేటర్లను మూసివేశారు.
తాజాగా కమల్‌తో పాటు పలువురు సినీ ప్రముఖుల ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి సంసిద్దులవుతున్నారు.కేంద్రం జీఎస్టీని ఏమాత్రం తగ్గించే ప్రశ్నే లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన అదనపు భారమైనా తగ్గించుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి ఇదే సమయంలో సందట్లో సడేమియా అన్నట్లు తమిళనాడుకు.. సినీ పరిశ్రకు చెందిన రజనీ సీఎం అయితే సినిమా వారందరి బాధలు అర్దం చేసుకుంటారనే వాదన మొదలైంది.