ఇప్పుడు ఎక్కడా చూసిన సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ని ఎలా తెర మీద ప్రెజెంట్ చేయబోతున్నారో? అనే దానిమీద ఇండస్ట్రీలోనే కాక రాజకీయ నేతలు, సగటు ప్రేక్షకుడు, నందమూరి అభిమానులు అంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూడడమే కాదు దాని మీద హాట్ హాట్ చర్చకు కూడా సిద్ధమవుతున్నారు. బయోపిక్ అంటే ఉన్నది ఉన్నట్లుగా చూపించడమే. కానీ ఈ మధ్యన కొన్ని నిజాలను తెరకెక్కిస్తామని చెబుతున్నప్పటికీ తెరమీద కొచ్చేసరికి అవన్నీ పూర్తిగా నిజాలకు వ్యతిరేఖంగా ఉంటున్నాయి. మరి తెలుగువారి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారక రామారావు బయోపిక్ ని ఆయన తనయుడు బాలకృష్ణ తెరకెక్కిస్తానని చెప్పాడు.
ఇప్పుడు దానికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటూ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇక వర్మ కూడా ఎన్టీఆర్ మీద ఓ పాటను కూడా రిలీజ్ చేసి జనంలో ఆసక్తిని రేపుతున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ని టచ్ చెయ్యకపోతేనే మంచిదని అంటున్నాడు టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి. అంత మహోన్నత వ్యక్తి జీవితం తెరిచిన పుస్తమే. ఇంకా బయోపిక్ లో ఏం చూపిస్తారంటూ అడుగుతున్నాడు. ఇక వర్మకి ఎన్టీఆర్ గురించి పూర్తిగా తెల్సు. ఆయనకి ఎన్టీఆర్ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించే ధైర్యముందా అంటూ ప్రశ్నలు సందిస్తున్నాడు. అసలు ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు... అలాంటివన్నీ దమ్ము ధైర్యం తో ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించగలరా? అని అడుగుతున్నాడు.
ఆయన నట జీవితంలో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఉన్న వ్యక్తి రాజకీయ జీవితంలో మాత్రం ఎన్నో విషయాలు ఆయనకు విరుద్ధంగా జరిగాయని అంటున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఎవ్వరిని లెక్కచేసే వ్యక్తి కాదని... ఆయన ఎంతో నిజాయితీ పరుడని... గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే వ్యక్తి సినిమా ప్రపంచాన్ని శాసించడం దగ్గరనుండి రాజకీయాలకు ఎలా అతీతుడయ్యాడో అనే విషయాన్ని తెరమీద ఎలా చూపెట్టగలరంటున్నాడు. అలాగే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన గుర్తు సైకిల్ ని తానే పెట్టుకున్నాడు. ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం.. అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్లో ఉన్నాడు. కానీ ఆయన తర్వాత మామగారి పార్టీలో చేరి చక్రం తిప్పడమే కాదు ఆయన్ని అధికారం నుండి తప్పించి సీఎం అవ్వడం అనేది కూడా అందరికి తెలిసిందే. మరి ఆ విషయాన్ని గనక తెర మీద చూపెడితే ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా వున్న చంద్రబాబు కి ఇబ్బందే గనక అలా చెయ్యడం కుదరదు.
అలాగే వైస్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ మీద చెప్పులు వేసిన ఘటన కూడా ప్రజలకు తెలుసు. మరవన్నీ సినిమాలో చూపెట్టాలంటే ఎన్నో గట్స్ ఉండడమే కాదు ఈ సినిమా తెరకెక్కేటపుడే పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఇక నాకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. నా అభిప్రాయం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ ని తియ్యకపోవడమే మంచిదంటున్నాడు. ఇక మీకు ఎన్టీఆర్ బయోపిక్ లో ఏదన్న రోల్ ఇచ్చి చెయ్యమంటే ఏమంటారని సదరు యాంకర్ పోసానిని అడగా... రోజుకి కోటి రూపాయలిచ్చి చెయ్యమన్నా చెయ్యనని చెప్పేసాడు. అలాగే ఎన్టీఆర్ పాత్రకి ఎన్టీఆర్ కొడుకులైన హరికృష్ణ గాని, బాలకృష్ణ గాని సెట్ అవుతారని ఇంకెవరు నప్పరని చెప్పాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మొహం అచ్చం తాతగారి సీనియర్ ఎన్టీఆర్ మొహంలాగే ఉంటుందని... నవ్వినా, మాట్లాడినా అచ్చం ఎన్టీఆర్ చేసినట్లే ఉంటుందని చెప్పాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి సీనియర్ ఎన్టీఆర్ పాత్ర చెయ్యడానికి వయసు సరిపోదని చెబుతున్నాడు.
కేవలం పోసాని మాత్రమే ఎన్టీఆర్ బయోపిక్ ని వ్యతిరేఖించడం లేదు. నందమూరి అభిమానులు సైతం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకెక్కించడం అనేది కరెక్ట్ కాదని చెబుతున్నారు. అందుకు గల కారణం వర్మ తీసిన రక్త చరిత్రలో ఎన్టీఆర్ ని కాస్త నెగెటివ్ గా చూపించడమే అంటున్నారు. మరి ఎన్టీఆర్ కేరెక్టర్ ని అప్పుడు బ్యాడ్ గా చూపెట్టి ఇప్పుడు ఆయన జీవిత కథని ఎలా తెరకెక్కిస్తాడని వారు వాదించడం గమనార్హం.