'బాహుబలి- ది కన్‌క్లూజన్' తర్వాత చాలా చిత్రాలే విడుదలయ్యాయి. వాటిల్లో కేవలం నాగ చైతన్య-కళ్యాణ్‌కృష్ణలో కాంబినేషన్ లో వచ్చిన 'రారండోయ్ వేడుకచూద్దాం'మాత్రమే బాగా లాభపడింది. ఆ తర్వాత డజన్ల కొద్ది చిన్న చిత్రాలు వచ్చినా ఆడలేదు. కానీ ఆది పినిశెట్టి నటించగా తెలుగులో డబ్ అయి, 'డిజె'కి ముందు ఓ వారం కిందట థియేటర్లలోకి వచ్చిన 'మరకతమణి' మాత్రం బడ్జెట్ పరంగా పోల్చుకుంటే నిర్మాతలకు, బయ్యర్లలకు రూపాయికి రూపాయి ఆదాయం సంపాదించి పెట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ చిత్రాన్ని అనువాద హక్కులను కేవలం 50లక్షలకు కొన్నారు. పబ్లిసిటీకి, ఇతర ఖర్చులు కలిపి మరో 15లక్షలు ఖర్చయ్యాయట. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా కోటి 30లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా శాటిలైట్ హక్కులు నిర్మాతల చేతిలోనే ఉన్నాయి. ఈహక్కులను ఓ శాటిలైట్ చానెల్ 20లక్షలకు అడుగుతోందని సమాచారం. ఈ విధంగా చూసుకుంటే ఈ చిత్రం నిర్మాతలకు, బయ్యర్లలకు రూపాయికి రూపాయి ఆదాయం తెచ్చినట్లే లెక్క.
ఇక 'సరైనోడు' తర్వాత ఆది పినిశెట్టి చిత్రాలకు కాస్త ఆదరణ పెరగడం కూడా దీనికి ఓ కారణం. కాగా వచ్చేవారం విడుదల కానున్న నాని 'నిన్నుకోరి'లో కూడా ఆది పినిశెట్టి కీలకమైన పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. ఇక 'బిచ్చగాడు' రేంజ్‌లో కాకపోయినా ఆ డబ్బింగ్ చిత్రం ఈ స్థాయిలో లాభాలు తేవడం 'బిచ్చగాడు' తర్వాత 'మరకతమణి' అనే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.