సాధారణంగా తెలుగు చిత్రాలలో తెలంగాణయాసతో కూడిన పాటలు తక్కువగానే ఉంటాయి. అప్పుడెప్పుడో వచ్చిన సుమన్, విజయశాంతిల 'మొండిమొగుడు పెంకి పెళ్లాం'లోని వస్తానన్నడే .. మస్కల బోనల్ పండుగకు వస్తానన్నడే.. లసేకా పూల్ పోరీకి తెస్తానన్నాడే.. అనే పాట అన్ని ప్రాంతాలలో కేకపెట్టించింది. తాజాగా మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా, ఎన్నారై యువకునిగా నటిస్తూ, 'ప్రేమమ్' బ్యూటీ సాయిపల్లవి తెలంగాణ అమ్మాయిగా కనిపింంచనున్న చిత్రం 'ఫిదా', దిల్‌రాజు నిర్మాణంలో క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
వరుణ్ తేజ్‌కు వరుసగా 'లోఫర్, మిస్టర్' వంటి డిజాస్టర్స్ రావడం, శేఖర్ కమ్ముల మ్యాజిక్ చేసి చాలా కాలమే కావడం, ఇటీవల శేఖర్ కమ్ముల పూర్తిగా ఫేడవుట్‌కావడంతో పాటు వరుణ్‌తేజ్‌కి యాక్సిడెంట్ వల్ల సినిమా ఆలస్యం అవ్వడంతో కూడా ఈ చిత్రానికి నిన్నా మొన్నటి దాకా సరైన బజ్ లేదు. కానీ ఈ చిత్రం ట్రైలర్ చూసిన తర్వాత శేఖర్ కమ్ముల మార్క్ ఆఫ్ టేకింగ్ కనిపించింది. ఇక తాజాగా మధుప్రియ ఆలపించిన 'వచ్చిండే... మెల్ల మెల్లగా వచ్చిండ్రే' పాట తెలంగాణ యాసకు సంబంధించిన లిరిక్‌తో ఊపు ఊపుతోంది.
ఇక మధుప్రియ వాయిస్ ఈ పాటకు మరింతగా హెల్ప్ కావడంతో ఈ పాట ఓ మోతమోగుతోంది. ఇక ట్రైలర్ కూడా 5మిలియన్ వ్యూస్‌ని దాటి తీసుకుని పోతోంది. వరుణ్ తేజ్‌కి 'ముకుంద, కంచె'చిత్రాలు ఆయనలోని నటనా ప్రతిభను బయటపెట్టినా కూడా ఆయనకు ఇంకా పెద్ద కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. దాంతో 'ఫిదా' చిత్రం ఆలోటును భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరో పక్క ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.