ఒకప్పుడు ఒక తమిళ హీరో సినిమా తెలుగులో బాగా ఆడిదంటే ఆయన నటించిన పాత చిత్రాలను, డిజాస్టర్ చిత్రాలను కూడా కొనేసి చిన్న చిన్న నిర్మాతలు డబ్ చేసి మొదటి వారంలోనే ఆ క్రేజ్‌ను వాడుకొని ఎంతో కొంత లాభపడేవారు. కానీ దానివల్ల హీరోలకు మాత్రం చాలా నష్టం. తాజాగా ప్రభాస్‌కి, బన్నీవంటి వారికి పెరిగిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని తమిళం, మలయాళం వంటి చోట్ల వారు నటించిన పాత డిజాస్టర్ మూవీస్‌ని కూడా డబ్ చేస్తున్నారు.
కానీ ఈ విషయంలో హీరోలు అప్రమత్తం కావాల్సివుంది. ఇక ఇప్పుడిప్పుడు యువహీరో సందీప్‌కిషన్ తమిళంలో హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. ఆయన నటించిన 'మానగరం' అక్కడ బాగానే ఆడింది. కానీ తెలుగులో మాత్రం ఆడలేదు. తెలుగు విషయానికి వస్తే ఆయనకు 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చిత్రమే ఇక్కడ మంచి హిట్. ఆయన ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న కృష్ణవంశీ 'నక్షత్రం' బాక్సులు బద్దలు కొట్టుకుని బయటకు ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.
'మానగరం' తెలుగులో ఆడలేదు. ఇక ఆయన మనసంతా త్వరలో విడుదలకు రెడీ అవుతోన్న 'శమంతకమణి', మహేష్ సోదరి మంజుల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంపైనే ఉన్నాయి. కాగా ప్రసుతం సందీప్‌కిషన్‌కి, హీరోయిన్ రెజీనాకి కోలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడం కోసం తెలుగులో ఫ్లాపయిన 'రా...రా..కృష్ణయ్య' మూవీని 'మహేంద్ర' పేరుతో డబ్ చేస్తున్నారు. తమిళంలో ఆయన నటించిన చిత్రాలు తెలుగులో ఆడటం లేదు. అది రివర్స్ అయి ఆయన నటించినా ఆడని ఈ తెలుగు చిత్రం తమిళంలో ఏమైనా మెప్పిస్తుందేమో చూడాలి.....!