గత ఎన్నికల్లో టిడిపి-బిజెపి కూటమికి పవన్ మద్దతు తెలిపాడు. నాడు ఆ పార్టీ గెలుపును మొత్తం ప్రభావితం చేయకపోయినా కనీసం కీలకమైన ఓట్ల విషయంలో మాత్రం పవన్ మద్దతు టిడిపికి బాగానే పనిచేసింది. కానీ ఇటీవల పవన్ ప్రత్యేకహోదా ఇవ్వని బిజెపిని, దానికి వంతపాడుతున్న టిడిపిని టార్గెట్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆయన బిజెపిపై మండిపడుతున్నాడు. దీంతో ఆయనపై ఆయన చంద్రబాబు వ్యూహం ప్రకారమే పవన్ నడుస్తున్నాడన్న విమర్శలను సైతం ఎదుర్కొంటున్నాడు.
చంద్రబాబు విషయంలో ఆయన చూసిచూడనట్లుగా, మెత్తగా ఉంటున్నాడనే భావన దూరం చేయడానికి పవన్ తనకు ఇప్పుడు అవకాశం వచ్చినట్లుగా భావిస్తున్నాడట. గత మూడేళ్లలో టిడిపికి మరలా తన ప్రభుత్వంపై అనుకూలత ఉందా? లేదా ప్రతికూలత ఉందా? అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. దాంతో చంద్రబాబు ఒంటెద్దు పోకడలు పోతూ ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు.
ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలు వైసీపీకి, టిడిపికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎలాగైనా గెలవాలని అధికార టిడిపి, విపక్ష వైసీపీలు మొహరించాయి. నాడు టిడిపి తరపున పోటీ చేసిన శిల్పామోహన్‌రెడ్డి ఈసారి వైసీపీ బరిలో, నాడు వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన భూమా సోదరుడి కుమారుడు టిడిపి తరపున పోటీలో ఉన్నారు. నంద్యాల పట్టణంలోని మెజార్టీ కౌన్సిలర్స్ వైసీపీ వెనుకే నిలుస్తున్నారు. ఇక నంద్యాలలో కాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి.
సో... పవన్ తానులేవనెత్తిన పలు సమస్యలను ఓకే అని చెప్పినా పరిష్కరించకపోవడం, అసలు గత ఎన్నికల్లో పవన్ వల్ల తామేవిధంగానూ లాభపడలేదని వాదిస్తున్న టిడిపి నాయకులకు తన పవర్ చూపాలని నిర్ణయించుకున్నాడట. అందులో భాగంగానే తనను కలిసిన అభిమానులను వైసీపీకే సపోర్ట్ చేయాలని సూచించాడట. కొందరు టిడిపి తరపున ప్రచారం చేయమంటే వారించి, కాదు వైసీపీకే జై కొట్టమని, కానీ ఈ మద్దతు ఈ ఒక్క ఉప ఎన్నికలకేనని వచ్చే ఎన్నికల నాటికి తాను వ్యూహం రచిస్తాడని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి ఏ ఉప ఎన్నికైనా ఖాళీ అయిన స్థానంలో అభ్యర్ది చనిపోతే సానుభూతి పవనాలు ఆ పార్టీకి, ఆ కుటుంబానికి ఎక్కువగా ఉంటాయి. మరోపక్క అధికార పక్షాలే ఎక్కువగా ఉప ఎన్నికలను గెలుస్తుంటాయి. ఈసారి మాత్రం రాబోయే ఎన్నికలకు వీటిని రిఫరెండమ్‌గా భావించినా తప్పు లేదని విశ్లేషకులు అంటున్నారు.