అబుదాబీలో సైమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ వేడుకలకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ స్టార్స్ అంతా హాజరయ్యారు. ఇక నటీమణులు అయితే వారి వారి అందాలతో, కొత్త కొత్త డ్రెసులతో కైపెక్కిస్తున్నారు. అక్కడ అందరికన్నా మన తెలుగు స్టార్స్ సందడే ఎక్కువగా వుందని అంటున్నారు. ఇక ఈ సైమా వేడుకలో అల్లు శిరీష్, మంచు లక్ష్మిలు హోస్టులుగా అదరగొట్టగా.. కొంతమంది హీరోయిన్స్ తమ తమ డాన్స్ లతో వేడుకని హోరెత్తించారు.
ఇక అక్కినేని వారసుడు అఖిల్ అయితే స్టేజ్ మీద పాటపాడి అందరిని ఆశ్చర్యపోయేలా చేసాడట. మరి అఖిల్ లో ఉన్న ఈ టాలెంట్ బయట ఎవ్వరికి తెలియదు సరికదా ఇండస్ట్రీలో చాలామందికే తెలియదట. అసలు అఖిల్ క్రికెట్ లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని మరీ నటనలోకి దిగాడు. 'అఖిల్' సినిమా ప్లాపయినప్పటికీ అఖిల్ డాన్స్ లకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు విక్రమ్ కుమార్ తో తన రెండో సినిమాను మొదలు పెట్టిన అఖిల్ కి ఇలా మ్యూజిక్ లో కూడా టాలెంట్ ఉందని ఎవ్వరు ఊహించి వుండరు. కానీ అఖిల్ చిన్నప్పటి నుండి సంగీతంలో శిక్షణ కూడా తీసుకున్నాడట.
ఇక అఖిల్ పాటల ప్రాక్టీస్ తనకి కూడా తెలుసనీ స్వయంగా సెలవిస్తున్న నాగార్జున తన కొడుకు ఇలా ఒక వేదిక మీద పాట పాడడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని అంటున్నాడు. ఇక స్టేజ్ మీద పాట పాడుతున్న అఖిల్ ని చూసిన వారంతా అఖిల్ లో ఈ టాలెంట్ కూడా దాగుందా అని ఆశ్చర్యపోయి అఖిల్ సాంగ్ ని ఎంజాయ్ చేశారట. అఖిల్ ఈ సాంగ్ పాడడం కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సహాయం కూడా తీసుకున్నాడట.