మొదటగా బ్రిటన్‌లో మొదలైన 'బిగ్‌బాస్' తరహా కార్యక్రమం.. తర్వాత హిందీ చానెల్స్‌లో సక్సెస్ కావడంతో తమిళంలో విజయ్ టీవీ కమల్‌హాసన్ హోస్ట్‌గా 'బిగ్‌బాస్'ని ఇప్పటికే ప్రారంభించింది. దీనికి పెద్దగా ఆదరణ లభించడం లేదు. కానీ పోను పోను సెలబ్రిటీల రాకతో ఈ కార్యక్రమాన్ని కమల్ ఎలాగైనా సక్సెస్ చేస్తాడని నిర్వాహకులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ కార్యక్రమానికి మొదటి షోలోనే జల్లికట్టు వంటి భావోద్రేకమైన ఉద్యమంలో పాల్గొన్న యువతిని సెలబ్రిటీ కిందకు తీసుకుని రావడం, ఫేడవుట్ అయిన నమిత రాకతో నెగటివ్ టాక్ వచ్చింది. దాంతో తదుపరి కార్యక్రమాలతోనైనా ఎలాగైనా ఆకట్టుకోవాలని చానెల్‌తో పాటు కమల్ కూడా తన పలుకుబడితో పలువురిని ఈ షోలో పాల్గొనేలా చేయాలని చూస్తున్నాడు.
మరోపక్క స్టార్ మా చానెల్ కూడా ఎన్టీఆర్ తో 'బిగ్‌బాస్'ని సక్సెస్ చేసేందుకు ముందు చూపుతో ఉంది. ఎన్టీఆర్ ఇప్పటికే తన ప్రాణస్నేహితుడైన రాజీవ్ కనకాల సతీమణి యాంకర్ సుమను అడగగా నో చెప్పింది. పలువురు సెలబ్రిటీల వారసులు కూడా తర్వాత చూద్దాం అంటున్నారట. ఇక అనసూయ, రేష్మిలతో పాటు పోసాని కృష్ణమురళి పేరు కూడా బాగా వినిపించింది. ఆయన నో చెప్పాడు. ఇక చిన్న చిన్న చిత్రాలలో నటిస్తున్న తేజస్వి, మధుశాలిని వారు లిస్ట్‌లో ఉన్నారు.
తాజాగా ప్రముఖ అంతర్జాతీయ సువార్త ప్రచారకర్త, వివాదాస్పద వ్యక్తి కె.ఎ.పాల్ దీనిలో పాల్గొననున్నాడని ప్రచారం మొదలైంది. మొత్తానికి తమకంటే తమిళంలో ఈ షోను ముందుగా ప్రారంభించడంతో వారు వేసే ప్లాన్లు సక్సెస్ అయితే తమకు అనుగుణంగా మార్చుకోవాలని ఎన్టీఆర్‌తో పాటు స్టార్ మా యాజమాన్యం చూస్తోంది.