నాని నటించిన 'నిన్ను కోరి' చిత్రం జూలై 7వ తారీఖున విడుదల కానున్న నేపద్యంలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో నాని ప్రసంగం చాలా మందిని బాగా ఆకట్టుకుంది. ఒకవైపు అభిమానులకు ఇన్‌డైరెక్ట్‌గా క్లాస్ పీకుతూనే, హుందాగా ఉండాలని తన ఫ్యాన్స్‌కి ఆయన చెప్పిన తీరు బాగుంది. నాని ప్రసంగించేటప్పుడు ఆయన అభిమానులు గోల చేస్తుంటే, ఆగండ్రా బాబూ మీకు థ్యాంక్స్ చెబుతున్నా మాట్లాడాలనేది మాట్లాడలేకపోతున్నాను అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
సంగీత దర్శకుడు గోపీసుందర్ నాకు 'భలే భలే మగాడివోయ్, మజ్ను' చిత్రాలతో పాటు 'నిన్ను కోరి'కి సంగీతం అందించాడు. ఈ 3 సినిమాలు 30 సినిమాలు కావాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఈ రోజు మిగతా టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి ఏమీ చెప్పను, ఇప్పుడు ఏది చెప్పినా ఎక్కువగా చెప్పినట్లు అవుతుంది. సినిమా విడుదల తర్వాత మీకే తెలుస్తుంది... అంటూ అనవసర భజన కార్యక్రమాన్ని పక్కనపెట్టి ప్రేక్షకులు ఓకే అన్న తర్వాతే మాట్లాడుతాను అంటూ హింట్ ఇచ్చాడు.
ఈ చిత్ర ట్రైలర్‌కి 10మిలియన్ వ్యూస్ రావడం చూసి షాక్‌కి గురయ్యాను. స్టేజ్ పై ఓ బుడ్డోడిని చూపిస్తూ వాడి వల్లే ఇన్ని వ్యూస్ వచ్చాయని తేల్చేశాడు. ఇక కొన్ని సినిమాలను చూసి అక్కడే వదిలేస్తారు. ఒట్టేసి చెబుతున్నా ఈ చిత్రాన్ని ఇంటికి తీసుకెళ్లి మనసులో దాచుకుంటారు. ఇది నిజం కాకపోతే అడిగే హక్కు అందరికీ ఉంది. అలా అడిగే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా రాదు. నేను చేసిన చిత్రాలలో ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిన చిత్రం ఇది అని చెప్పడంతో నాని భలే పెద్దరికంగా మాట్లాడాడంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.