భారతదేశ చరిత్రను ఒక్కసారి తిరిగిచూస్తే..మనుషులను 4 రకాలుగా విభజించారు. అందులో ప్రథములు బ్రాహ్మణులు. అధిక మేథాసంపత్తి గలవారని, వేదాలు, సంస్కృతులు తెలిసిన వారని వీరికి రాజుతో పాటు, ఒక్కొసారి రాజు కూడా వీరి మాటే వినేవారని చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి వారి రాకతో వీరి ప్రాధాన్యం తగ్గింది తప్ప అంతరించిపోలేదు.
ప్రస్తుతం కూడా బ్రాహ్మణులకు ప్రాధాన్యతకు వచ్చిన లోటు ఏమీ లేదు కానీ, వారిని గుడిలో పూజారులుగా, శుభకార్యములకు సమయములు చెప్పేవారిగా, శంఖుస్థాపనలు మొదలైనటువంటి వాటిని చేసే వారి గానే గుర్తిస్తున్నారు తప్ప..వారి మేధాసంపత్తిని వాడుకునే వారు అతి తక్కువ మందే ఉన్నారని గమనించవచ్చు. దీనికి కారణం కొందరు బ్రాహ్మణులు చేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి.
అసలు విషయం లోకి వస్తే..నేడు బ్రాహ్మణులపై కొందరు లేనిపోనివి సృష్టించి సినిమాలు తీస్తున్నారు కానీ, ఆ సినిమాల్లో బ్రాహ్మణుల పాత్ర ఎంత గొప్పదో చెబుతున్న సందర్భాలను మాత్రం విస్మరిస్తున్నారు. ఎక్కడో మంచు హీరో సినిమాలో బ్రాహ్మణులను తప్పుగా చిత్రీకరించారని, బ్రాహ్మణులపై వస్తున్న ప్రతి సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు బ్రాహ్మణులు. కానీ తమిళ డైరెక్టర్ శంకర్ తీసిన అపరిచితుడు గానీ, తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన దువ్వాడ జగన్నాధం వంటి చిత్రాల్లో హీరోల పాత్ర చిత్రీకరణను గమనిస్తే.. నిజంగా బ్రాహ్మణులు గర్వపడాలి. జరుగుతున్న తప్పును బ్రాహ్మణుడే గుర్తించగలడు, దానిపై పోరాటం చేసే విధానం కూడా బ్రాహ్మణునికి తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు అనేట్లుగా ఈ చిత్రాలు ఉన్నాయి.
ఇలాంటి చిత్రాలకు అడ్డుపడుతూ.. బ్రాహ్మణులు ఏం సాధిస్తున్నారో తెలియదు కానీ, ఒక సినిమా కమర్షియల్‌గా ప్రజలందరిలోకి వెళ్ళాలంటే కొన్ని ఇబ్బందికర సన్నివేశాలు తప్పక పెట్టాల్సి ఉంటుంది. ఫైనల్‌గా సభ్యసమాజానికి తమ క్యాస్ట్‌ని ఎలా చూపించారు అనే దానిని తెలుసుకోవడంలో తప్పులేదు కానీ.. చిన్న చిన్న పదాలు వాడటం వల్ల తమ క్యాస్ట్ పరువు పోతుందని భావించే వాళ్లు.. తమ క్యాస్ట్‌లో తమ క్యాస్ట్ పరువు తీసే వారు నిజంగా లేరని, అందరూ సత్యహరిశ్చంద్రులని గుండెలమీద చెయ్యివేసి చెప్పగలరా..?