గత డిసెంబర్‌లో జయలలిత మరణం నుంచి పన్నీర్‌సెల్వం, పళనిస్వామి, దినకరన్,స్టాలిన్‌లతో పాటు రజినీ రాజకీయ రంగ ప్రవేశం, సుబ్రహ్మణ్యస్వామి రజినీని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, రజినీ అభిమానులు పోస్టర్ల నుండి ఫెక్ల్సీల వరకు, చిన్నమ్మ శశికళ జైలు కెళ్లడం, ఆర్కే నగర్ ఉప ఎన్నికల రద్దు, రెండాకుల గుర్తు కోసం దినకరన్ ఏకంగా ఈసీకి పెద్దమొత్తంలో లంచం ఇవ్వబోయాడనే విషయాల నడుమ మరోవైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమిళనాడును కనుసైగలతో శాసిస్తున్న విధానం, దానికి ప్రతికగా తమిళయువత జల్లికట్టు ఉద్యమం వరకు తమిళనాడు రాజకీయాలు ఒకదానితో మరోటి ముడివేసుకునే ఉన్నాయి.
ఇక రజినీని పరరాష్ట్ర వ్యక్తిగా చెప్పి కమల్, భారతీరాజా, శరత్‌కుమార్‌ల వరకు మాట్లాడుతున్న తీరు కూడా చర్చనీయాంశం అయింది. ఏది ఏమైనా రజినీ చేసిన మంచి పని ఏమిటంటే తన అభిమానులతో ఫొటో షూట్ పేరుతో చెన్నైకి పిలిచి ఎవరు రెచ్చగొట్టినా మౌనంగా ఉండమని, ఎలాంటి ఉద్రేగాలకు చోటిచ్చి వివాదాలను సృష్టించవద్దని, ఎవరు ఏమి మాట్లాడినా మౌనంగా ఉండాలని తన ఫ్యాన్స్‌కి చెప్పడమే మంచిదైంది.
ఈ విషయంలో రజినీ ముందుచూపును, పెద్దరికాన్ని మెచ్చుకోవాల్సిందే. అలాగే రజినీ అభిమానులు కూడా తాము ఉద్రేకపడితే అది అవకాశం కోసం ఎదురుచూస్తున్న వ్యతిరేకులకు అవకాశం ఇచ్చినట్లుగా భావించి, తమ హీరో చెప్పిన మాటను ఆచరిస్తున్నారు. కాగా గతంలో నటి కస్తూరి రజినీ స్ధిరమైన నిర్ణయాలు తీసుకోలేని పిరికి వ్యక్తి అని, అస్ధిరమైన పరిస్థితుల్లో కూడా స్ధిరమైన నిర్ణయం తీసుకునే వారే నిజమైన రాజకీయనాయకులని వ్యాఖ్యలు చేసింది.
దాంతో రజినీ అభిమానులు కూడా ఆమెపై మండిపడ్డారు. నీ సంగతి మాకు తెలుసులే.. అన్నారు. మీ మొహం.. మీరు పుట్టకముందు నుంచే రజినీ నాకు తెలుసు అని ఆమె సమాధానం ఇచ్చింది. మరలా మౌనంగా ఉండకుండా ఆమె రజినీ అభిమానులను మరోసారి కెలికింది.
రాష్ట్రంలో వర్షాలు, నీటి సమస్యలు, రైతుల సమస్యలు ఇన్ని ఉండగా మీకేమీ పట్టవా? ఎంత సేపు ఫ్యాన్స్‌కి, మీడియాకి అదే పనా .. అంటూ నోటికి పనిచెప్పింది. ఇప్పుడు తమిళనాట ఇవి మరో సంచలనంగా మారాయి. అభిమానులు మారరు.. ప్రజలు మారరు. మీడియా మారాదు.. అందరూ అదే పనిలో ఉంటారు. ఏంచేద్దాం...!