నేటి పరిశ్రమ పోకడ నిజమైన సినీ అభిమానులకు మింగుపడటం లేదు. నిన్నటిదాకా ప్రేక్షకులు మంచి వారే.. మీడియానే చెడ్డదని చెప్పిన 'డిజె' టీం ఇప్పుడు ప్రేక్షకులనందరిని తప్పుపడుతోంది. చివరికి ఈ వివాదం ముదిరి ముదిరి ఏ దిశను తీసుకుంటుందో కూడా తెలియడం లేదు. ఒకరిద్దరు డబ్బులు తీసుకుని రివ్య్యూలు రాసే వారున్న జర్నలిస్ట్‌లందరినీ డీజే టీం తూలనాడింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ సినిమా రావడంతో దిల్‌రాజు, హరీష్‌శంకర్‌లు సర్దిచెప్పుకునే ప్రయత్నం చేయకుండా వారిని వీరు.. వీరిని వారు తిట్టుకునే పనిలో పడ్డారు.
మీరెంత అక్కస్సు వెళ్లగక్కినా, ఓర్వలేక పోయినా 'డీజే'ను ఏం చేయలేరు? అని రెచ్చగొట్టే వ్యాఖ్యలెందుకు చేస్తున్నారు? అసలు ఇలా అభిమానుల మధ్య అభిప్రాయబేధాలుంటే ఇద్దరు హీరోలతో మాట్లాడి ఒకే ఒక్క స్టేట్‌మెంట్ ఇప్పించే పని చేయకుండా ఇంకా ఎందుకు సినీ పెద్దలు, డిజె యూనిట్ చోద్యం చూస్తోంది? ఈరోజు బన్నీ యాంటీ ఫ్యాన్స్ చేసిన పనికి.. పనిలో పనిగా దిల్‌రాజుగారు అందరు అభిమానులను సందేహిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. కనీసం హరీష్‌శంకర్ బెటర్. ఆయన మీకోసం మంచి క్వాలిటీ పిక్చర్, సౌండ్ కోసం ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌ని, సౌండ్ ఇంజనీర్‌ని తెచ్చాం. మీ కోపం దిల్‌రాజు మీద కాదని మాకు తెలుసు.. అంటూ అనునయించే ప్రయత్నం చేస్తుంటే దిల్‌రాజు మాత్రం అందరినీ ఒకేగాటిన కట్టేస్తూ మధ్యస్తం ఉన్నవారిని కూడా వివాదంలోకి తెస్తున్నాడు.?
ఈ రోజు బన్నీ సినిమాను లీక్ చేసిన వారు రేపు మరో సినిమాని కూడా లీక్ చేస్తారు. అందులో సందేహం లేదు. ఇప్పుడు బన్నీ యాంటీ ఫ్యాన్స్ ఆ పని చేస్తే రేపు బన్నీ ఫ్యాన్స్ అదే పనిచేస్తారు. తద్వారా ఇండస్ట్రీకే నష్టం. కాబట్టి ఆయా హీరోల వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేయకుండా మీరెన్ని చేసినా మా సినిమా ఇన్ని కోట్లు వసూలు చేసిందని మాట్లాడటం భవిష్యత్తు రీత్యా కూడా నిన్నటివరకు అందరి హీరోలతో సినిమాలను తీసిన తటస్థమైన దిల్‌రాజు అలా మాట్లాడకూడదు.
మరో విషయం ఏమిటంటే తమ సినిమా పైరసీ, లీక్‌ల దాకా వస్తే హడావుడి చేసే వారు... ఇతర చిత్రాల విషయంలో ఇదే జరిగితే మాత్రం ఇళ్లు కాలుతుంటే నవ్వుతూ చుట్ట వెలిగించుకున్న చందంగా చేస్తున్నారు. రేపు పక్కనోడి ఇల్లు కూడా తగలబడే దాకా ఎవ్వరికీ దాని నొప్పి తెలీదు. పంతాలు మాని హీరోలను ఓకే వేదికపైకి తెచ్చే పెద్దదిక్కే దాసరి తర్వాత లేకుండా పోయారు...!