నేడు తెలుగులోని చిత్రాలు హిందీలోకి కూడా డబ్ అవుతూ అక్కడ కూడా తమ హవా చాటుతున్నాయి. తాజాగా 'బాహుబలి'తో ఆ ఊపు మరింత జోరందుకుంది. ఇక రానాకి తెలుగుతో పాటు హిందీలోనూ మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా 'బాహుబలి-ది బిగినింగ్, ఘాజీ, బాహుబలి-ది కన్‌క్లూజన్'తో అది మరింతగా ఎక్కువైంది.
విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం 'స్పైడర్' ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మురుగదాస్‌కి తమిళనాట ఉన్న క్రేజ్ దీనికి బాగా ఉపయోగపడనుంది. ఇక మురుగదాస్‌కి బాలీవుడ్‌లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి మహేష్ తోడవ్వడంతో ఈ చిత్రం హిందీ రైట్స్ 20కోట్ల మంచి మొత్తానికి అమ్ముడుపోయాయి.
ఆ తర్వాత వచ్చిన 'డిజె' (దువ్వాడజగన్నాథం) చిత్రం హిందీ యూట్యూబ్, డిజిటల్ రైట్స్‌తో 8కోట్లకు అమ్ముడయ్యాయి. బన్నీ నటించిన 'సరైనోడు' చిత్రం హిందీ వెర్షన్‌కి యూట్యూబ్‌లో మంచి వ్యూస్ లభించడంతో ఇది సాధ్యమైంది.కానీ ప్రస్తుతం రానా హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ సెటైర్ మూవీ 'నేనే రాజు..నేనే మంత్రి' హిందీ రైట్స్ ఏకంగా 11కోట్లకు అమ్ముడై బన్నీ 'డిజె'ని తోసి రాజని, మహేష్ తర్వాతి స్థానాన్ని రానా దక్కించుకోవడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఇదే హవా కొనసాగితే బహుభాషా నటునిగా రానా త్వరగా సోలో హీరోగా కూడా బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.