సాధారణంగా నేటి దర్శకనిర్మాతులు ఎలా ఉన్నారంటే.. ఓ సినిమాను చేసేటప్పుడు ఈ పాత్రను మా హీరో కాకుండా ఎవ్వరూ చేయలేరు. అసలు ఆయన మంచితనం చెప్పినా అర్దంకాదు.. ఖబడ్దార్, సాహో, స్వీట్ వార్నింగ్, వస్తున్నా 'దున్నేస్తాం' అని తమ సినిమా ఆడటం కోసం ఆయా హీరోల అభిమానులను ముందుగా రెచ్చగొట్టేది ఆయా సినిమాల దర్శకులు, నిర్మాతలే. ఎవరి సినిమా చేస్తుంటేవారి భజన చేయడం, బాలకృష్ణతోటి చేస్తే ఆయన్ను మించిన వాడులేడని, అదే నిర్మాత దర్శకుడు చిరంజీవితో చేస్తుంటే చిరంజీవి లాంటి వారు ఇక పుట్టరు.. పుట్టబోరు అంటూ ఆయా ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టేది వారే.
మా సినిమా ఇండస్ట్రీ టాప్ 5లో ఒకటి. మా సినిమా అందరి హీరోలను మించేలా కలెక్ట్ చేసిందని చెప్పేది కూడా వారే. అసలు మీరేం రాసుకున్నా ఫర్వాలేదు.. రివ్యూలు మమ్మల్నేం చేయలేవు? అంటారు. అలా అన్నప్పుడు ఇక బ్యాడ్ రివ్యూలు రాశారని మీకు బాధ ఎందుకు? రివ్యూల వల్ల రెవిన్యూ రాదని తెలిస్తే వాటిని వదిలేయండి. మీ పనిలో మీరు ఉండండి. మీడియా పనిలో మీడియా, ప్రేక్షకుల పనిలో ప్రేక్షకులు ఉంటారు. నిజమైన హిట్టా, కొత్తదనం ఉందా? లేదా? అనేవి లాంగ్‌రన్‌లో తెలుస్తాయి.
తెలుగులో 'బాహుబలి' కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రం మాదే... అని చెప్పి వైషమ్యాలు పెంచేది వీరే. అసలు చాలామంది హీరోలున్నారు. ఉదాహరణకు నాని, శర్వానంద్, రాజ్‌తరుణ్... వంటివారిని తీసుకుంటే ప్రేక్షకులకు వారి కులాలు ఎలా తెలుస్తున్నాయి? ఇన్‌డైరెక్ట్‌గా ప్రతి హీరో మొదట్లో నేను మీ కులం వాడిని అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పడం వల్లే అభిమానులు, కులాల మధ్య అగ్గి రాజేసి, ఇళ్లు తగలబడుతుంటే బీడీలు, సిగరెట్లు కాల్చుకుని, వాటిలో చలికాచుకునే వారు సినిమా వారేగానీ ఫ్యాన్స్ కాదు.
అసలు 'డిజె' విషయంలో హరీష్‌శంకర్ పాటలో తప్పుంటే తియ్యాలి.. .లేదా ఉంచుకోవాలి. అంతేగానీ నేను కూడా బ్రాహ్మణుడినే అని ఎందుకు వివరణలో తన కులం గురించి చెప్పాడు? డబ్బు, పేరు కోసం సొంత దేశాన్ని , తమ మతాలను, తమ కులాలను కూడా సెటైర్లు వేసే వారు లేరా? హరీష్‌శంకర్ బ్రాహ్మణుడిని కాబట్టి నేను బ్రాహ్మణును కించపరచనన్నాడు. నిజమే... మరి కమ్మవారిని విమర్శించవచ్చా? నీ కులం కాని ఏ కులానైనా నువ్వు చెడ్డగా చూపిస్తావా? గతంలో బ్రాహ్మణుల వివాదంలో చిక్కుకున్న 'దేనికైనా రెడీ' విషయానికి వస్తే దానికి కథ, మాటలు,,మాటల సహకారం, ఇలా ఎన్నో అందించిన కోనవెంకట్, బి.విఎస్ రవి, మరుధూరి రాజా వీరందరూ నిష్ట కలిగిన బ్రాహ్మణులే.
అయితే వారి కులం వారే మాంసం తిన్నట్లు ఎందుకు చూపిస్తారు? ఓ పండితుడి భార్య కనిపించిన ప్రతి మొగాడిని ఏమండీ అంటూ కౌగిలించుకునే దౌర్భాగ్యపు భావ దారిద్య్రం మీకెందుకు? జంధ్యాలగారు కూడా అలాంటి సీన్‌ను తీశారు.దాంట్లో శ్రీలక్ష్మి కనిపించిన వారందరినీ తన కొడుకు గా భావించి 'బాబూ' అనే డైలాగ్‌ను కామెడీని మిక్స్ చేస్తూనే కన్నతల్లి ప్రేమను చూపించారు?ఈ ప్రశ్నలకు సమాధానం 'డిజె' యూనిట్ వద్ద ఉందా?