గతేడాది తెలుగులో 'క్షణం, పెళ్లిచూపులు' వంటి చిత్రాలు బాగా ఆడాయి. దాంతో చాలా మందికి ఆ చిత్రాలు మంచి లైఫ్‌నిచ్చాయి. డైరెక్టర్లతో పాటు విజయ్ దేవరకొండ, అనసూయ వంటి వారు బిజీ అయ్యారు. అవార్డులు కూడా వచ్చాయి. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు చిన్న,కొత్తవారితో కూడిన చిత్రాలలో ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా లేదు. 'శతమానం భవతి' హిట్టయినా శర్వానంద్ ఏమీ చిన్నోడు కాదు.
ఇక గత కొంత కాలంగా విడుదలైన చిత్రాలలో 'కాదలి' చిత్రం బాగానే అంచనాలు తెచ్చుకుంది. కేటీఆర్, రామ్ చరణ్‌లు ఆడియోరిలీజ్ చేయడం, గతేడాది 'పెళ్లిచూపులు' రిలీజ్ చేసి బాగా లాభాలు గడించిన సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేయడం కూడా ఆసక్తిని కలిగించింది. ఇక 'రాముడింట కృష్ణుడంట, రాజా నువ్వు కేక, ఓ పిల్లా నీవల్లా వంటి చిత్రాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయేయో కూడా తెలీదు.
ఇక కొందరైతే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని, సినిమా ఓ వారం తర్వాత పికప్ అయ్యే అవకాశాలున్నా కూడా పక్క వారం వచ్చే వాటికి థియేటర్లు లేకపోవడంతో సినిమాలను ఎత్తివేస్తున్నారని, నిర్మాతల మండలేకాదు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా తమను పట్టించుకోవడం లేదంటూ నిట్టూర్పూ విడుస్తున్నారు. మరి కొందరు ఏకంగా తెలుగు ప్రేక్షకులు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌లలాగా విభిన్న చిత్రాలను ఆదరించరని, చిన్న సినిమాను టిక్కెట్టు పెట్టి కొనరని, కేవలం స్టార్స్ చిత్రాలే చూస్తారంటున్నారు.
ఇక 'పెళ్లిచూపులు' చిత్రాన్ని నిర్మించి, అవార్డులు, రివార్డులు పొందిన నిర్మాత రాజ్ కందుకూరి మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. బాగున్న సినిమానే ఎవ్వరూ ఏమీ చేయలేరని,దానికి 'పెళ్లి చూపులు'ఉదాహరణ అని, తాను తీస్తున్న రెండో చిత్రం 'మెంటల్ మది' చిత్రం కూడా ఖచ్చితంగా హిట్టవుతుందని బల్లగుద్ది వాదిస్తున్నాడు.