వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను ఇద్దరూ ఇద్దరే.. ఇద్దరు మాస్ మాంత్రికులు. కాగా వినాయక్ కిందటి చిత్రం చిరు 150వ ప్రతిష్టాత్మక రీఎంట్రీ మూవీ 'ఖైదీనెంబర్ 150' చిత్రం బ్రహ్మాండంగా ఆడింది. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం విడుదలై ఇంతకాలం అయినా వినయ్ మౌనంగానే ఉన్నాడు. మరో హీరోతో సినిమా ప్రకటించలేదు. చిరు నుంచి బాలయ్య, బన్నీ, మహేష్, పవన్ వరకు రామ్‌నుంచి సాయిధరమ్‌తేజ్ వరకు అందరూ బిజీనే.
ఇక బోయపాటి శ్రీను గత చిత్రం 'సరైనోడు' కూడా బ్లాక్‌బస్టరే. దాంతో ఆయన ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రకుల్‌ప్రీత్‌సింగ్‌లతో 'జయ జానకి నాయక' తీస్తున్నాడు. ఈ చిత్రం ఆగష్టు11న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత బోయపాటి కూడా ఫ్రీ అయిపోతాడు. ఆయనకు తదుపరి కమిట్ మెంట్ చిరంజీవి-అల్లుఅరవింద్‌లతో ఉంది. కానీ ఆగష్టు చివరి నుంచి చిరంజీవి సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మాతగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'తో వచ్చే వేసవి దాకా బిజీ అవుతాడు. ఓ మూడు నాలుగు నెలలు ఆయన తన తదుపరి స్క్రిప్ట్‌కి కేటాయించినా కూడా జనవరి లోపలే అది పూర్తవుతుంది.
ఇక స్టార్స్‌లో సీనియర్ స్టార్ వెంకటేష్ ఖాళీగా ఉన్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో 'తులసి' వచ్చి పెద్ద విజయం సాధించింది. ఇక 'రాజుగారి గది2' ఆగష్టు చివర్లో విడుదల అవుతుంది కాబట్టి నాగ్ కూడా ఫ్రీ అవుతాడు. ఆ తర్వాత ఆయన మరో చిత్రం ఇప్పటివరకు ఒప్పుకోలేదు. అఖిల్ రెండో చిత్రంతో బిజీ అవుతూనే ఆయన కూడా మరో చిత్రంలో నటించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకు వినాయక్, బోయపాటిలతో నాగ్ చేయలేదు. ఇక ఆయన కెరీర్‌లో పూర్తి స్థాయి మాస్ సినిమా చేసి చాలాకాలమే అవుతోంది. అది కూడా నిన్నటితరం దర్శకులతో. సో.. నాగ్, వెంకీలలో వినాయక్, బోయపాటి ముందుకెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూద్దాం...!