నేడున్న నిర్మాతల్లో దిల్‌రాజుది భిన్నశైలి. సినిమా అంటే దానిని ప్యాషన్‌గా చూస్తూనే మరో కోణంలో బిజినెస్‌గా చూడటం వల్లే ఇప్పటికీ ఆయన తీసిన 25 చిత్రాలలో అధిక శాతం విజయాలు సాధించి అవార్డులతో పాటు రివార్డులు కూడా తెచ్చిపెట్టాయి. ఇక ఆయన తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ, నా 25 చిత్రాలలో ఆరు చిత్రాలు సరిగా ఆడలేదు. గెలుపు వస్తే నాదని, ఓటమి వస్తే పక్కవారిదని నేను నిందను మోపను.
నిజానికి విజయాలలో కంటే ఫెయిల్యూర్స్‌లోనే నా బాధ్యత ఎక్కువని ఒప్పుకుంటాను. ఇక నాకు ఫెయిల్యూర్ నిచ్చిన చిత్రాలలో మూడు చిత్రాలకు మరింత వర్క్ చేసి కష్టపడి ఉంటే విజయం సాధించేవి. అవి 'రామయ్యా వస్తావయ్యా, మున్నా, రామరామ కృష్ణ కృష్ణ'. రామయ్యా వస్తావయ్యా విషయానికి వస్తే నేను, హరీష్ అనుకున్న కథ వేరు. కానీ అంతలోనే 'రెబెల్' చిత్రం వచ్చింది. మరలా అలాగే కథను ఉన్నది ఉన్నట్లు తీస్తే రివ్యూలలో బ్యాడ్ రేటింగ్స్ వస్తాననిభయపడ్డాను.
అందుకే కథను మార్చాం. అందుకే ఫ్లాప్ అయింది అన్నారు. అంటే ఆయన రివ్యూల వల్ల సినిమాలపై ఎంతో కొంత ఎఫెక్ట్ పడే మాటను అంగీకరించాడు. కానీ తాజాగా మాత్రం రివ్యూలు ఎలా ఇచ్చినా ఫర్లేదు. రివ్యూలను చూసి ఎవ్వరూ సినిమాకు వెళ్లరు అని సూత్రీకరించాడు. ఇక తను శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తుడినని, అందుకే తన బేనర్‌కు కూడా ఆయన పేరే పెట్టాను. రాముడు, కృష్ణుడులు నాకు అచ్చిరాలేదు.
శ్రీవేంకటేశ్వరస్వామి నేను నీకుండగా, రాముడు, కృష్ణుడు అని పెట్టడం ఏమిటని కోపగించుకున్నాడో ఏమో..? అందుకే 'రామ రామ కృష్ణ కృష్ణ' రామయ్యా వస్తావయ్యా, కృష్ణాష్టమి ప్లాప్ అయ్యాయని చెప్పుకొచ్చాడు.ఇక తాజాగా మనకు గుర్తుకు వచ్చే విషయం ఏమిటంటే రివ్యూలు ఎలా వచ్చినా ఫర్లేదని చెప్పిన ఈయన 'కృష్ణాష్టమి'కి తనకు తానే రివ్యూ రాసి రేటింగ్ ఇచ్చుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది..!