తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి నటించి విడుదలకు సిద్దమవుతోన్న 'మామ్' చిత్రం ప్రమోషన్‌లో శ్రీదేవి బిజీగా ఉంది. కాగా గత కొంత కాలంగా అంటే 'బాహుబలి' తర్వాత శివగామి పాత్రను ఆమె వదులుకోవడం, భారీ పారితోషికాలు, లాభాలల్లో వాటా అడగడం వంటి వాటిపై చర్చసాగుతోంది. పాత్రను శ్రీదేవి చేయకపోవడమే మేలైందని, రమ్యకృష్ణలా ఆమె నటించగలిగేది కాదని స్వయంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
దీనిపై శ్రీదేవి స్పందించింది. శివగామి పాత్ర కోసం తన వద్దకు దర్శకనిర్మాతలు వచ్చిన మాట, తాను దానిని తిరస్కరించిన మాట వాస్తవమేనని, కానీ దాన్ని నేను వదులుకోవడమే పెద్ద తప్పు అని చెప్పడం సరికాదంది. ఇక తాను ఆ పాత్రను నిరాకరించడానికి నా కారణాలు నాకుంటాయంది. తాను 'ఇంగ్లీష్ వింగ్లీష్' తర్వాత ఎన్నో చిత్రాలు వచ్చినా నిరాకరించానని, మరి వాటికి లేని వివాదం కేవలం బాహుబలికి మాత్రమే చేయడం ఏమిటి? నేను ఆ చిత్రం విడుదలైన తర్వాత చూడనైనా చూడలేదు.
అ శివగామి పాత్రలో ఎవరు నటించారో? ఎలా నటించారో కూడా నాకు తెలియదు. దీనిని వివాదం చేయడం దిక్కుమాలిన పని అని వ్యాఖ్యానించింది. కానీ 'ఇంగ్లీషు వింగ్లీషు' తర్వాత తమిళ 'పులి'లో నటించారు కదా...! అన్న ప్రశ్నను ఆమె దాటవేసింది. కాగా 'మామ్' చిత్రం జులై 7న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఆమె భర్త బోనీకపూర్ స్వయంగా నిర్మిస్తున్నాడు. కాగా ఆతేదీకి శ్రీదేవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ రోజుతో శ్రీదేవి సినీ ఫీల్డ్‌లోకి ఎంటరై 50 ఏళ్లు పూర్తవుతాయి. కాబట్టి అదే రోజున తన భార్య శ్రీదేవికి ఆయన ఈ చిత్రాన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నాడు. మరి ప్రేక్షకులు ఆమెకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో వేచిచూడాల్సివుంది..!