అసలు రాష్ట్ర విభజన చేసిన తర్వాత వైసీపీ తెలంగాణను పట్టించుకోవడమే మానేసింది. కేవలం ఏపీలో ఉంటే చాలని భావిస్తోంది. కనీసం టిడిపిలోనైనా రేవంత్‌రెడ్డి, రమణలున్నారు. వైసీపీ అయితే బిచాన ఎత్తేసింది. పోనీ ఆ రాష్ట్రాన్ని వదిలేసారా అంటే అదీ లేదు. తాజాగా తెలంగాణ వైసీపీ ప్లీనరి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణ విషయం పక్కనపెట్టామని, ముందుగా 2019లో ఆంధ్రాలో అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణ సంగతి చూద్దామని ప్రసంగించడంతో ఆ ప్లీనరీకి వచ్చిన కార్యకర్తలు, నాయకులు తీవ్ర అసంతృప్తికిలోనై ఉత్సాహం కోల్పోయారు.
కనీసం తమను ఉత్సాహపరచడానికైనా తెలంగాణలో బలం చాటుదాం అని ఎందుకు అన లేదని, లోపాయికారీగా టీఆర్‌ఎస్‌ని చూసి భయపడి సజ్జల అలా మాట్లాడాడని అంటున్నారు. మరోపక్క ఈ ప్లీనరీకి జగన్‌తో సహా ఆయన కుటుంబీకులెవ్వరూ హాజరుకాలేదు. మరి వైజాగ్‌కి వెళ్లిన జగన్ ఇక్కడికి ఎందుకు రాలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైసీపీ మొదటి తెలంగాణ ప్లీనరీకి ఆయన హాజరుకాకపోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు.
మరోపక్క ఈ ప్లీనరీలో మట్లాడిన నాయకులంతా జగన్ ఆంధ్రాని చూసుకున్నా, తెలంగాణకు మాత్రం ఆయన సోదరి షర్మిలాను నాయకురాలిని చేయాలని సూచించారు. మరోపక్క జగన్ ఈ మధ్య పార్టీ సీనియర్ నాయకులనే కాదు.. తన సోదరి షర్మిలా, బావ అనిల్ కుమార్‌లతో పాటు స్వయంగా తల్లి విజయమ్మను కూడా దూరంగా పెట్టాటనే విమర్శలు ఎక్కువయ్యాయి..!