'బాహుబలి' ఇచ్చిన కిక్‌తో మోహన్‌బాబు కూడా మంచు విష్ణుని పెట్టుకుని 'కన్నప్ప' అనే చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి 'కన్నప్ప' చిత్రాన్ని చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఎప్పుడో రెండేళ్ల కిందటే ఈ చిత్రం టైటిల్‌ను కూడ 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రిజిష్టర్ చేయించారు. దాంతో ఈ చిత్రాన్ని సునీల్‌తో తీయాలని భావించిన శివభక్తుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి చేత స్క్రిప్ట్ వర్క్ చేయించి, దానిని మంచువిష్ణుతో తీయమని తనికెళ్ళభరణిని కోరాడు. దాంతో భరణి.. సునీల్‌ను పక్కనపెట్టి 'కన్నప్ప' స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు.
కాగా ఒకప్పుడు భక్తకన్నప్పగా నటించిన కృష్ణంరాజుకు ప్రభాస్‌తో ఆ చిత్రాన్ని తీయాలనేది డ్రీమ్‌ప్రాజెక్ట్. కానీ ప్రభాస్ 'బాహుబలి'లో దాదాపు నాలుగైదేళ్లు గడిపే సరికి లేటయింది. ఇక 'బాహుబలి' తర్వాతనైనా తన స్వీయ దర్శకత్వంలో చేయాలని భావించిన కృష్ణంరాజు.. మోహన్‌బాబు ఇంటికి వెళ్లి మరీ అది నా డ్రీమ్‌ప్రాజెక్ట్. ఆ సినిమా ద్వారానే నేను డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వాలని ఇంతకాలం వెయిట్ చేశాను. ప్రభాస్‌కి 'బాహుబలి' తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌తో ఈ చిత్రాన్ని కూడా 'బాహుబలి'లాగా అనేక భాషల్లో, అంతటి సాంకేతిక విలువలతో నిర్మించాలని కూడా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడట.
మీరు డ్రాప్ అయితే త్వరలో ఆ చిత్రం మొదలుపెడతానని రిక్వెస్ట్ చేసుకున్నాడని, కానీ మోహన్‌బాబు మాత్రం మేము ఖచ్చితంగా తీస్తాం.. కావాలంటే మీరు కూడా తీసుకోండి.. ఎవరి సినిమా బాగుంటే అదే ఆడుతుంది అని వెటకారంగా, ఖరాఖండీగా చెప్పాడని అంటున్నారు. అప్పటినుంచి కృష్ణంరాజు, మోహన్‌బాబు అంటే మండిపడుతున్నాడని అంటున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రీపొడక్షన్ పనిని కూడా మొదలుపెట్టి, ఇటీవలే టైటిల్‌ను రెన్యువల్ చేయించాడు. ఈ చిత్రంలో కన్నప్పగా మంచు విష్ణు, శివుడిగా మోహన్‌బాబు నటించడమే కాదు.. ఈ చిత్రం ద్వారా తానే స్వయంగా దర్శకునిగా మోహన్‌బాబు మారనున్నాడట. ఇదే జరిగితే కృష్ణంరాజు - మోహన్‌బాబుల మధ్య కూడా విబేధాలొచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు.