తాజాగా విడుదలైన 'డిజె' (దువ్వాడ జగన్నాథం) కు కొన్ని చోట్ల మిక్స్‌డ్ రెస్పాన్స్, మరికొన్ని చోట్ల ఫ్లాప్ టాక్ వస్తున్న విషయం దాచితే దాగేదికాదు.. ఇక అనూహ్యంగా బన్నీ, హరీష్‌శంకర్, దిల్‌రాజుల సుడి బాగుంటే సినిమా ఆడినా ఆడవచ్చు. ఎందుకంటే 'సరైనోడు' ఎంత బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ ఆ చిత్రం పరమరొటీన్, అందరి ఫేట్ బాగుండటం, అల్లువారి ప్రమోషన్ ఈ చిత్రానికి కలిసి వచ్చాయి. ఇక పోటీగా ఏ పెద్ద సినిమా లేకపోవడం నుంచి ఎన్నో అనుకూలతల మధ్య ఆ చిత్రం విడుదలైంది. వసూళ్లు సాధించినంత మాత్రాన అది మంచి సినిమా అయిపోదు. ఇక రివ్యూలనేవి అవి కలెక్ట్ చేసే రెవిన్యూలను బట్టి, నిర్మాతలు చెప్పే అంకెల గారడీలను బట్టి, తమకు తాము డప్పువాయించుకునే ప్రెస్‌మీట్లను బట్టి, థ్యాంక్స్ మీట్‌లను బట్టి ఉండవు.
షకీలా సినిమానో లేక 'బాబు బాగా బిజీ'నో, లేదా వర్మ తీయాలనుకున్న 'శ్రీదేవి' వంటి చిత్రాలు బాగా కలెక్ట్ చేసినా అవి మంచి చిత్రాలు ఎప్పుడూ కాలేవు. గతంలో మలయాళంలో పరిస్థిని గమనిస్తే షకీలా సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారంటే చాలు మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేష్‌గోపీలు కూడా తమ సినిమాల రిలీజ్ డేట్లను వాయిదా వేసుకునే వారు. మరి షకీలా చిత్రాలకుఎంత రేటింగ్ ఇవ్వాలి? 'ఆ నలుగురు..మీ శ్రేయోభిలాషి' వంటి వాటికి పెద్దగా ఆడకపోయినా ఎంత రేటింగ్ ఇవ్వాలి అన్నదే అసలు డిబేట్. ఇక ఈ గొడవ ఇప్పటిది కాదు.. ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన 'పోకిరి' చిత్రానికి కూడా మామూలు రేటింగ్‌లే వచ్చిన సంగతి, దానిని పూరీ 'నేనింతే' చిత్రంలో సెటైర్ వేయాలని చూసినా ఆ చిత్రం ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా హరీష్‌శంకర్ మాట్లాడుతూ.. సినిమా టాక్‌కి, సినిమా రివ్యూలకు సంబంధంలేదని, టాక్ , రేటింగ్‌ల కంటే సినిమాకు రెవిన్యూ అదిరిపోతోందని చెప్పాడు. నిజమే.. ఇంకా ఆయన మాట్లాడుతూ, రివ్యూ రాసిన వారిని తప్పుపట్టడం లేదంటూ వెన్నపూసి, ఒకరిద్దరు రివ్యూల ద్వారా ఇచ్చిన రేటింగ్ ప్రపంచానికి మొత్తానికి వర్తించదని చెప్పాడు. తమ చిత్రానికి తక్కువ రేటింగ్‌లే గాక మంచి రేటింగ్‌లు ఇచ్చినవారు కూడా ఉన్నారన్నాడు.
ఇక ఆయన దీనికి ఉదాహరణగా 'శతమానంభవతి'ని తీసుకొచ్చి, దిల్‌రాజు తీసే సినిమాలన్నింటికీ మీడియా తక్కువరేటింగే ఇస్తుందని చెప్పడం గర్హనీయం. ఇండస్ట్రీ తో పాటు పలు సామాన్యుల్లో రేటింగ్ విషయంలో పలు అనుమానాలున్నాయి. కానీ సినిమాకి రేటింగ్ అనేది సినిమాని నెగటివ్ యాంగిల్‌లో కూడా చూసి అందులోన కథ, కంటెంట్‌లో ఉన్న గొప్పతనం, నూతనత్వం, సమాజానికి ఏదో చెప్పాలనే ప్రయత్నాన్ని బట్టి రేటింగ్‌లు ఇస్తారు.
దిల్‌రాజు సినిమాలకు ఎక్కువ రేటింగ్ ఇవ్వరని హరీష్ డబుల్ మీనింగ్‌లో చెప్పాడీ.. తనకు తానే మేధావినని భావించే ఈ స్వీయ మేధావి. సినిమాలో 'పైన అమ్మవారుంటారు.. కింద కమ్మవారుంటారు' అనే విధంగా తాను రివ్యూలలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చాడని అనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న పుకారు ఏమిటంటే దిల్‌రాజు సినిమా రివ్యూలు బాగా రాయమని ఎవ్వరికీ రూపాయి కూడా ఇవ్వడు. కాబట్టే రివ్యూలు అలా వస్తున్నాయేది హరీష్‌శంకర్ డబుల్ మీనింగ్‌లోని అర్ధం. మరి మంచి ఎక్కువ రేటింగ్‌లు ఇచ్చిన మీడియా కూడా ఉంది కదా..! మరి ఆయా వెబ్‌సైట్లకు ఎంత ఇచ్చారు? తక్కువ రేటింగ్ ఇచ్చిన వారికి ఎందుకివ్వలేదు.
'బొమ్మరిల్లు' సందర్బంగా సామాన్యంగా ఎంత మంచి సినిమాకైనా 3.5తో ఆపేసే మీడియా దానికి 4, 4.5 ఇచ్చారు. ఎవరి సినిమానైనా విమర్శలతో చీల్చిచెండాడే 'ఆంధ్రభూమి' దినపత్రికలో ప్రతి శుక్రవారం ఇచ్చే వెన్నెల పేజీలో మొదటిసారిగా ఆ పత్రిక 4రేటింగ్ ఇచ్చింది. అప్పట్లో దిల్‌రాజు గారు దానిని బాగా తమ సినిమా ప్రమోషన్‌కు వాడుకున్నారు. మరి ఆనాడు దిల్‌రాజు మంచి రేటింగ్‌లు ఇచ్చిన మీడియా కి డబ్బులిచ్చే రివ్యూ రాయించున్నాడేమో ముందు సమాధానం చెప్పి ఆ తర్వాత మీ మేధావితనాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది హరీష్ శంకర్!