మొత్తానికి రజనీ రాజకీయ రంగప్రవేశం ఖాయమైంది. మిగిలినదంతా లాంఛనమే. పార్టీ పేరు, విధివిధానాలు, జెండా వంటి వాటి రూపకల్పన జరుగుతోందని ఆయన ప్రాణ స్నేహితుడు బహదూర్‌తో పాటు ఆయన సోదరుడు కూడా తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రజనీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న ఆయన ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించనున్నాడని తమిళ రాజకీయ వర్గాలు అంటున్నాయి.
మరోపక్క తాజాగా రజనీని కలిసిన వీర విధేయ హిందు సంస్థ హిందు మఖల్‌కట్చి నాయకులు మీరు ఎప్పుడు రాజకీయాలలోకి రానున్నారు? అని అడిగితే ఖచ్చితంగా వస్తానని చెప్పాడని ఆ సంఘ అద్యక్షుడే ప్రకటించాడు. కాగా ప్రస్తుతం తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అక్కడ హిందుత్వ ఏజెండా ఉన్న బిజెపికి, లౌకిక జెండా పట్టుకునే కాంగ్రెస్, వామపక్షాలు వీటికేమీ అక్కడ స్థానంలేదు. సుబ్రహ్మణ్యస్వామి వంటి వ్యూహకర్త ఉన్నా బిజెపి, చిదంబరం వంటి వారున్న కాంగ్రెస్‌లు అక్కడ నామమాత్రమే. ఏదో ఒక ప్రాంతీయ పార్టీలో కలవందే ఒక్క ఓటు కూడా పడదు. కానీ జయ మరణం తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.
తాజాగా రాష్ట్రపతి అభ్యర్ధి రామ్‌నాథ్ కోవింద్‌కు బిజెపి అడగక ముందే సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం, చివరకు దినకరన్ కూడా మద్దతు తెలిపేశాడు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటంతో అసలే అవినీతి రాజకీయాలలో రాటుదేలిన నాయకులు బిజెపి మాటకు హడలెత్తిపోతున్నారు. ఎవరు జైలుకు వెళ్లాలో..ఎవరి మీద సిబిఐ, ఐటి సోదాలు జరుగుతాయో తెలియని బిక్కుబిక్కుమనే పరిస్థితి. చివరకు డీఎంకే తరపున స్టాలిన్ కూడా మోదీ కే నా మద్దతు అంటున్నాడు.
ఇక రజనీ కేవలం తన రాజకీయ ఎంట్రీ గురించి ప్రత్యేకంగా హిందు సంస్థ నాయకులకు చెప్పడం బట్టి, రజనీ కొత్త పార్టీ పెట్టినా బిజెపికి అండగా ఎన్డీయేలోనే ఉండటం ఖాయమైందంటున్నారు.