ఎన్నికల ముందు వరకు 'జై జవాన్-జై కిసాన్' అంటారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆటోమేటిగ్గా దానిని మర్చిపోవడం నాయకులకు మామూలైపోయింది. గత ఎన్నికల్లో అవినీతితో పాటు 'జై జవాన్..జైకిసాన్' అని మోదీ పిలుపునిచ్చాడు. ఇటీవల ఇద్దరు జవాన్లను పాకిస్థాన్ సైన్యం ముక్కలు ముక్కలుగా నరికినా మన మోదీకి స్పందన లేదు. మరోవైపు రక్షణకు సంబంధించిన విషయాలు బయటకు చెప్పకూడదంటారు. సైన్యానికి మేకిన్ ఇండియా పేరుతో చెత్త, పనికి మాలిన తుపాకులు ఇస్తున్నారు. ఇక ఇటీవల తాము తినే భోజనం పురుగుల మయమై పోయిందని వాపోయిన ఓ జవాన్‌ని అరెస్ట్ చేసి, ఆర్మీ కోర్టులో హాజరుపరిచి, ఉద్యోగం, జీతం, పెన్షన్ వంటి వన్నీ ఆపేశారు. ఇక ముష్కరులు నరికిన ఓ జవాన్ భార్య, కూతురు.. మోదీకి గాజులు పంపించారు. కానీ మన దొరగారు ఖరీదైన సూటులు వేసుకుంటూ విదేశాలు తిరుగున్నారు.
ఇక గత ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షమైన టిడిపి రైతు రుణమాఫీ అని చెప్పింది. అది రాష్ట్రాలకు సంబంధించిన విషయం. దానికోసం మేము డబ్బులివ్వమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో పాటు రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ కూడా తేల్చేశారు. నాడు ఏపీలో ఎన్నికల సభలో టిడిపి ఆ హామీ ఇచ్చిందని అంతమాత్రాన వేదికపై ఉన్న మోదీది కాదని గౌరవనీయులైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సెలవిచ్చారు. తాజాగా కూడా ఆయన రైతు రుణమాఫీ అనేది ఓ ఫ్యాషన్ అయిపోయిందని, అలా కాకుండా రైతులకు అండగా నిలవాలని సెలవిచ్చారు. టాలీవుడ్‌లో మాత్రమే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు. కానీ దేశవ్యాప్తంగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ.. ఇలా ఏ భాషైనా దేశం మొత్తం మన తెలుగువాడైన వెంకయ్యనాయుడు నిజమైన మాటల మరాఠి.
గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వంలో నాటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రైతులు తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆత్మహత్య చేసుకుంటే భారీ పరిహారం వచ్చి కుటుంబాలు ఆనందంగా ఉండటానికే రైతులు ఆత్మహత్యలనేవి కామన్ అయిపోయాయని వ్యాఖ్యానించాడు. ఇక నాడు చంద్రబాబు కూడా సీఎంగా ఉండి వ్యవసాయం దండగ అన్నాడు. ఇక తాజాగా బిజెపి పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో కూడా రుణమాఫీ జరిగింది. మరి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులైన ఆ ఇద్దరు సీఎంలు కూడా ఫ్యాషన్‌కి అలవాటు పడ్డారా? అనేది వెంకయ్యే చెప్పాలి. ఇక తాజాగా ఎన్నికల దగ్గరపడటంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ రుణమాఫీ ప్రకటించిన నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మరి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో స్వయంగా మోదీనే సభలో రైతులకు రుణమాఫీ అని చెప్పాడా? లేదా? అనేది నాయుడు గారే చెప్పాలి. ఇక ఆయన రైతులకు రుణమాఫీ కాకుండా రైతులను దగ్గరకు తీసుకోవాలి అని బోధించాడు. మరి మోదీ పవర్‌లోకి వచ్చిన తర్వాత తెలంగాణ, ఏపీ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి మోదీ, వెంకయ్య, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి ఎందరిని చేరదీశారో, ఎందరి ఆత్మహత్యలను ఆపగలిగారో వెంకయ్య గారే సెలవిస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది? నిజంగానే జై జవాన్, జై కిసాన్‌ని మోదీ, వెంకయ్యలు తీర్చినవారవుతారు...!