చెప్పేవి శ్రీరంగనీతులు... దూరేది ఆ గుడెసెలు అని మన పెద్దలు చెప్పిన మోటు సామెత మన రాజకీయ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. అన్ని పార్టీల నాయకులు ఇదే విధంగా ఉన్నారు. వైఎస్ హయాంలో పలు భూకుంభకోణాలు, కబ్జాలు, ఇతర పలు మనీ లాండరింగ్ వంటి కేసులు, ఏకంగా ఆంద్రా, కర్ణాటక సరిహద్దులను కూడా కబ్జా చేసి మైనింగ్‌లు చేసిన గాలిజనార్దన్‌రెడ్డి, జగన్, బ్రదర్ అనిల్‌కుమార్ వంటి వారు ఇప్పుడు నీతులు చెబుతుంటే నవ్వుతో పాటు ఆవేదన కూడా కలుగుతోంది. వారి మీద కేసులు పనిచేయవని, అవి కోర్టులో నిరూపితం కావని చదువురాని వాడు కూడా చెబుతాడు.
పవన్ చెప్పినట్లు చట్టాలు బలవంతుల విషయంలో బలహీనంగా, బలహీనుల చేతుల్లో బలంగా పనిచేస్తున్నాయనేది ఇటీవలే సత్యంబాబు విషయంలో నిరూపితమైంది. ఇక తాజాగా జగన్ సూక్తులు చెప్పడానికి వైజాగ్ వెళ్లాడు. అక్కడ 75వేల కోట్ల భూకజ్జా జరిగిందని అందరూ అంగీకరిస్తున్నారు. ఇందులో మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారా లోకేష్‌లతో పాటు అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల అండ ఉన్నది అనేది కూడా వాస్తవమే. దానికి మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలే ఉదాహరణ. అక్కడ భూకబ్జాలు చేసిన వారు 10లక్షలు ఎకరాకు ఇస్తేగానీ తాము కబ్జా చేసిన భూములు ఇవ్వమని బెదిరిస్తున్నారు. వినని వారి స్థలాలలో ప్రభుత్వ రోడ్లు వేస్తున్నారు. నిజమే.. దానికి జగన్‌కి మద్దతుగా లెఫ్ట్ పార్టీలు, లోక్‌సత్తా వంటివి కూడా జత కలిశాయి.
ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం బాగున్నాయి. ఈ కబ్జా కేసును ప్రభుత్వ అధికారుల చేత చంద్రబాబు విచారణ చేయిస్తానని చెప్పడం సీతను ఎత్తుకెళ్లిన విషయంలో రావణాసురుడు కుంభకర్ణునితో విచారణ చేయించడం లాంటిదని, దానిని సిబిఐకి ఇస్తే అది నివేదికను హనుమంతుని చేతికి ఇస్తేనే జరుగుతుందని వ్యాఖ్యానించాడు. అది చాలా మంచి పోలిక.. మరి సిబిఐకి అప్పగిస్తే చంద్రబాబు కేసు పరిష్కారం కావడానికి 20ఏళ్లు పడుతుందనే వ్యాఖ్యలపై కూడా జగన్ స్పందించాడు.
ఈ కేసును పరిష్కరించడానికి సిబిఐకి 20ఏళ్లు పడుతుందా? లేక సిబిఐకి ఇస్తే తనకు 20ఏళ్ల జైలు పడుతుందని భయమా? అని జగన్ మాట్లాడటం బాగుంది. కానీ తన కేసుల్లో అదే సిబిఐని, జెడీ లక్ష్మీనారాయణపై తనకు నమ్మకం లేదని జగన్ ఎలా అన్నాడు? అనేది ప్రశ్న. ఇక ఈ భూకబ్జాల విషయంలో పలువురు బాధితుల చేత జగన్ మైక్ ఇచ్చి మాట్లాడించాడు. ఓ బాషా అనే బాధితులు ఈ భూమిని తనకు 2004లో పట్టా ఇచ్చారని, 2008లో రాజశేఖర్‌రెడ్డి ప్రభత్వంలోనే తన భూమి కబ్జా చేశారని చెప్పడంతో అందరూ షాకయ్యారు.
అక్కడికి వచ్చిన పలువురు బాధితులు కూడా తమభూములు కాంగ్రెస్‌లోని వైఎస్ హయాంలోనే రాయలసీమ మాఫియా కబ్జా చేసిందని చెప్పడం గమనార్హం. ఇక తాను గెలిస్తే ప్రతి సెంటు భూమిని కూడా తాను బాధితులకు తిరిగి ఇస్తానని జగన్ చెప్పడం, అక్కడి బాధితుల వేదన చూస్తే జగన్ నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించున్నాడనే సెటైర్లు పడుతున్నాయి.