ఈ మధ్యకాలంలో అల్లుఅర్జున్ బాగా మారిపోయాడని, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడని ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' వంటి విభిన్న కాన్సెప్ట్‌లతో పాటు పరమ రొటీన్ చిత్రాలైన 'రేసుగుర్రం, సరైనోడు' కూడా బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడంతో బన్నీ అత్యుత్సాహం చూపిస్తున్నాడంటున్నారు. సరే 'రేసుగుర్రం' బ్రహ్మానందం కామెడీ వల్ల ఆడింది అనుకుందామన్నా, పరమ రొటీన్, రొటీన్‌లకే రొటీన్‌గా వచ్చిన 'సరైనోడు' మాత్రం అనూహ్యవిజయమే. ఈ విషయంలో విశ్లేషకులు కూడా తమ పాత మాటకే కట్టుబడి ఉన్నారు. రివ్యూలలో పరమ రొటీన్ అని రాసిన వారు తాము చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. వాస్తవం కూడా అదే. ఆ సినిమాని మొదటి రోజు చూసిన అభిమానులు కూడా పెదవివిరిచారు. కానీ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడం అనేది ప్రేక్షకుల అంతిమతీర్పు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, బ్రహ్మరథం పట్టడం ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్నే అయింది. ఇప్పటికీ దానికి సరైన సమాధానం దొరకడం లేదు. దీంతో బన్నీ కూడా తానేం చేసినా జనాలు చూస్తారనే భావనలో ఉన్నాడు.
ఇక 'డిజె' విషయానికి వస్తే బన్నీ క్రేజ్‌తో పాటు ఆయన ఫాలోయింగ్, దిల్‌రాజు మీద కాన్ఫిడెన్స్, దేవిశ్రీ సంగీతం, హరీష్‌శంకర్, ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్స్ ద్వారా దీనిలో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పుష్కళంగా ఉంటుందనే భరోసా అందరికీ కలుగుతోంది. ఈ చిత్రం బడ్జెట్ 55కోట్లు. కేవలం థియేటికల్ రైట్స్ ద్వారానే 78కోట్ల నుంచి 80కోట్ల దాకా వచ్చాయి. దీంతో దిల్‌రాజుకు ప్రీరిలీజ్ బిజినెస్‌లోనే 25కోట్లు లాభం వచ్చింది. ఇక పోస్టర్ ఖర్చులు, ఇతర ఖర్చులు కలిపి 2కోట్లు వేసుకున్నా, ఈ చిత్రం బిజినెస్ మీద డిస్ట్రిబ్యూటర్లు 80కోట్లు పెట్టుబడి పెట్టారు అంటే ఈ చిత్రానికి సేఫ్ కావాలంటే కనీసం 80కోట్లయిన వసూలు చేయగలగాలి. ఆపైన వస్తేనే లాభాలు. ఇక ఆడియో, శాటిలైట్ వంటివన్నీ కలుపుకుని 100కోట్ల ప్రీరిలీజ్ జరుపుకున్న తొలి బన్నీ మూవీ ఇది.
ఇక తాజాగా బన్నీ యూట్యూబ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్బంగా బన్నీ,దిల్‌రాజులు ఏదో మాట్లాడుకుంటున్న పిక్ చూపి మేం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసా? అన్నాడు. చివరకు బన్నీనే... నో డౌట్ మనం బాహుబలిని బద్దలు కొడదాం.. గ్యారంటీ అని తాము మాట్లాడుకున్నట్లు బన్నీ చెప్పాడు. మరి ఇది అల్లువారి అబ్బాయి ఆత్మవిశ్వాసమా? లేక అతివిశ్వాసమా? అని సెటైర్లు వినిపిస్తున్నాయి. మరి బన్నీది కాన్ఫిడెన్సా లేక ఓవర్‌కాన్ఫిడెన్సా? అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది.. వెయిట్ అండ్ సీ...!