దిల్‌రాజు.. అభిరుచి ఉన్నచిత్రాలను నిర్మిస్తూ, తన 25వ చిత్రంగా అల్లు అర్జున్ తో 'డిజె' చేస్తున్నాడు. ఇది తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం కావడంతో తన కెరీర్ ప్రయాణాన్ని చెప్పుకొచ్చాడు. ఎక్కడో నిజామాబాద్‌లో చిన్న గ్రామంలో పుట్టిన తనకు ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేదని తెలిపాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా ఫ్యామిలీ ఆటో మొబైల్ బిజినెస్‌లో ఉండేది. కానీ నేను సినిమా నిర్మాత కావాలని వచ్చాను. నిజాయితీగా చెప్పాలంటే సినిమా పిచ్చితో కాకుండా దీన్ని కూడా ఓ వ్యాపారం లాగా చేయాలని నిర్ణయించుకున్నాను.
1996లో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చి హర్షిత అనే డిస్రిబ్యూషన్ సంస్థను స్థాపించి అదే ఏడాది 3 చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. 40లక్షలు నాడబ్బు మరో 40లక్షలు అప్పుచేసి సినిమాలు ఆడకపోవడంతో మొత్తం పోగొట్టుకున్నాను. నాడు కాస్ట్యూమ్స్ కృష్ణకి నటునిగానే గాక నిర్మాతగా కూడా మంచి అభిరుచి ఉండేది. ఆయన చేసిన.. సౌందర్య హీరోయిన్‌గా ప్రధాన పాత్ర పోషించిన 'అరుంధతి' చిత్రాన్ని 34 లక్షలకు కొన్నాను. సినిమా డిజాస్టర్. మొత్తం పోయాయి. 32 లక్షలు ముందే కట్టేశాను. ఫ్లాప్ అయిన తర్వాత కూడా బ్యాలెన్స్ 2లక్షలను కూడ కాస్ట్యూమ్స్ కృష్ణకి ఇచ్చేశాను. సినిమా ఫ్లాప్ అయితే అలా ఇవ్వడం అరుదే. దాంతో నా నిజాయితీ చూసి కాస్ట్యూమ్స్ కృష్ణ ముచ్చటపడ్డారు. ఆ టైంలో ఆయన ఓ చిత్రం ప్రారంభించి నన్ను కూడా ప్రారంభోత్సవానికి పిలిచాడు. నాడు కాస్టూమ్స్ కృష్ణ 'అనురాగ సంగమ'అనే రీమేక్‌ని చేయాలని భావించారు. నాకు కథ బాగా నచ్చడంతో ఆయన దానిని నాకే ప్రేమతో ఇచ్చేశారు. అదే 'పెళ్లిపందరి'. ఈ చిత్రాన్ని ఎం.ఎస్.రెడ్డి భాగస్వామ్యంలో నిర్మించి, ఇప్పుడు 25వ చిత్రం విడుదల చేస్తున్నాను.
నాకు 'దిల్' చిత్రం సమయంలో వినాయక్ నాకు కథ ఎలా వినాలి? ఎలా విజన్ చేసుకోవాలి? స్క్రిప్ట్ నుంచి బడ్జెట్ వరకు అన్ని ప్రాక్టికల్‌గా నేర్పించారు. నాకు 'జగడం' చిత్రం విషయంలో మాత్రం సుకుమార్‌తో విబేధాలు వచ్చాయి. ఆ చిత్రాన్ని సుక్కు, బన్నీ, నేను కలిసి చేయాలనుకున్నాం. కానీ కథలో కొంచెం తేడా ఉందని నేను భావించాను. సుక్కు వినలేదు. మరో నిర్మాతతోనైనా తీస్తాను గానీ కథపై నాకు నమ్మకం ఉంది అన్నాడు. ఆ చిత్రం ఫలితం అందరికీ తెలిసిందే. నా 25 చిత్రాలలో నాకు 18హిట్లు ఉన్నాయి.నన్ను రామానాయుడు గారితో పోలుస్తుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఇక నిజానికి నిర్మాత కన్నా డిస్ట్రిబ్యూషన్‌లోనే ఎక్కువ కష్టాలున్నాయని గ్రహించాను అని చెప్పుకొచ్చారు.