ఒక్కొక్కప్పుడు ఒక్కో రకం ట్రెండ్ సినిమా ఫీల్డ్‌లో నడుస్తుంటుంది. దీనికి ఎవ్వరూ అతీతులు కారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పీరియాడికల్ మూవీస్, దేశభక్తి, బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇక 'బాహుబలి'తో తెలుగు, తమిళం, హిందీలతో పాటు మలయాళం వంటి చిన్న పరిశ్రమ కూడా ఏకంగా 1000కోట్ల బడ్జెట్‌కు తయారవ్వడం అంటే అదే ట్రెండ్ కింద లెక్క.
కాగా ఇప్పుడు తెలుగుస్టార్స్ కొందరు దేశభక్తి, రాజకీయాల బ్యాక్‌డ్రాప్ ఉన్న కథల వైపు చూస్తున్నారు. ఎన్నికలు ముందుగా వస్తాయనే ఆశతోనో, లేక అలాంటి కథలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారనో తెలియదు గానీ మొత్తానికి ఇప్పుడు తెలుగులో ఆ బ్యాక్‌డ్రాప్‌లో పలు చిత్రాలు రూపొందుతున్నాయంటున్నారు.
తాజాగా ఇంకొన్ని గంటల్లో విడుదలకు సిద్దమైన 'డిజె' చిత్రంలో కూడా పొలిటికల్ టచ్ ఉంటుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఏపీలో ఇటీవల జరిగిన ఓ పెద్ద భూస్కాంతో పాటు పలువురి వద్ద స్థలాల పేరిట డబ్బులు సేకరించి, ప్రజలను నిలువునా మోసం చేసిన కంపెనీ బ్యాక్‌డ్రాప్‌తో పాటు పొలిటికల్‌టచ్, పొలిటికల్ పంచ్‌లు కూడా ఉంటాయంటున్నారు. ఓ బ్రాహ్మణ యువకుడు అమాయకంగానే ఉంటూ ఎలా ప్రజలకు మేలు చేశాడు అనేదే పాయింట్ అంటున్నారు. అంటే దాదాపు 'జెంటిల్‌మేన్'తరహా అన్నమాట.
ఇక పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కూడా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవన్‌కి పొలిటికల్‌మైలేజ్ ఇచ్చేదిగా ఉంటుందంటున్నారు. త్రివిక్రమ్ తదుపరి చేయబోయే జూనియర్ ఎన్టీఆర్ చిత్రం సైతం అదే కోవలో ఉంటుందట. మరోపక్క మహేష్ చేస్తున్న 'స్పైడర్' బయోటెర్రరిజం అనే పాయింట్‌తో, కొరటాలతో చేయబోయే 'భరత్ అనే నేను' పొలిటికల్ బ్యాగ్రౌండ్‌లో ఉంటుందని తేలిపోయింది. అల్లుఅర్జున్ నటించే తాజా చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' కూడా దేశభక్తి కంటెంట్ అని టైటిల్ వింటేనే తెలిసిపోతోంది...!