'డీజే.. దువ్వాడ జగన్నాథం', మరో 48 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అర్జున్ - పూజ హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం హరీష్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కింది. ఈ శుక్రవారమే విడుదలవబోతున్న 'డీజే' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అయితే 'దువ్వాడ జగన్నాథం' పై బ్రాహ్మణ సంఘాలు కత్తి కట్టిన విషయం తెలిసిందే. 'గుడిలో బడిలో మడిలో' పాటలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా కొన్ని పదాలను పెట్టారని చిత్ర యూనిట్ పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాక చాలా రచ్చ కూడా చేశాయి.
అయితే చిత్ర నిర్మాత దిల్ రాజు పాటలోని పాదాలను మారుస్తున్నామని బ్రాహ్మణ సంఘాలకు మాట ఇచ్చాడు. అన్నట్టుగానే పాటలో అస్మైక యోగ- తస్మైక పదాలను మార్చేశామని, అలాగే నమకం, చమకం స్థానంలో గమకం, సుముఖం పదాలు చేర్చి సెన్సార్ సర్టిఫికెట్ పొందామన్నాడు. ఇంకేముంది 'డీజే'ని బ్రాహ్మణ సంఘాలు వదిలేశాయని అందరూ భావించారు. కానీ బ్రాహ్మణ సంఘాలు 'డీజే' ని వదలలేదు సరికదా జిడ్డులా వెంటాడుతూనే వున్నాయి. డీజేపై మంగళవారం బ్రాహ్మణ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.
కేవలం 'డీజే' పాటలోనే కాకుండా సినిమాలోని కొన్ని సన్నివేశాలు కూడా బ్రాహ్మణుల మనోభావాలను కించపరచేలా ఉన్నాయంటూ పిటిషన్ వేసాయి. మరి మళ్ళీ డీజే సమస్య మొదటికి వచ్చిందంటున్నారు. ఈ పిటిషన్‌తో 'డీజే' అనుకున్న టైమ్‌కి విడుదల అవుతుందా అన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. తక్కువ సమయం వుండడంతో ఈ ఇష్యూని నిర్మాత ఎలా డీల్ చేస్తారని అంటున్నారు. కానీ 'డీజే' చిత్ర యూనిట్ మాత్రం సినిమా విడుదల పట్ల చాలా ధీమాగా ఉన్నట్లు కనబడుతుంది. చూద్దాం ఈ సమస్య రెండు రోజుల్లో ఎలా సద్దుమణుగుతుందో..?