'బాహుబలి' సాధించిన విజయం దెబ్బకి అందరూ తమ తమ సినిమాలు ఆ రేంజ్ హిట్స్ సాధించాలనే కోరిక బలంగా ప్రతి ఒక్కరి మనసులో పాతుకుపోతున్నాయి. అందులో మొదటిగా 'బాహుబలి' విజయాన్ని బాగా దృష్టిలో పెట్టుకుంది మాత్రం చిరంజీవే... అని చెబుతున్నారు. అందుకే చిరు 151వ ప్రాజెక్ట్ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం కోసం చిరంజీవి మైండ్ సెట్ మారిపోయిందని అంటున్నారు. 'ఉయ్యాలవాడ...' చిత్రం జాతీయ స్థాయిలో మార్మోగాలంటే ఖర్చు విషయంలో వెనుకాడకూడదని ఫిక్స్ అయ్యారంట. ఇక సినిమా మాత్రం ఆలస్యమైనా పర్లేదుగాని ఏ విషయంలో కూడా తగ్గకూడదని చిరు భావిస్తున్నాడట.
అందుకే ఇప్పుడు 'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి' గురించి ముందు నుండి అనుకున్న ప్లాన్స్ అన్ని మారిపోయాయట. ఆ ప్లాన్ లో భాగంగానే టాప్ టెక్నీషియన్స్ ని ఈ చిత్రం కోసం రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. 'ఉయ్యాలవాడ...' సంగీతానికి జాతీయ స్థాయిలో క్రేజ్ రావాలంటే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలని అనుకుంటున్నారట. దేశభక్తి సినిమాలకు రెహ్మాన్ ఎలాంటి సంగీతం ఇస్తాడో... అందరికి తెలిసిందే. అలాంటి రెహ్మాన్ ని 'ఉయ్యాలవాడ...' కోసం ఒప్పించేందుకు చిత్ర యూనిట్ రంగంలోకి దిగిందని అంటున్నారు.
ఇక హీరోయిన్ విషయంలో కూడా ఇప్పటి వరకు అనుకున్న టాలీవుడ్ హీరోయిన్స్ ని పక్కన పడేసి బాలీవుడ్ నుండి చిరు కోసం హీరోయిన్ ని తెచ్చేపనిలో కూడా యూనిట్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అలాగే 'ఉయ్యాలవాడ...' గ్రాఫిక్స్ కోసం ఏకంగా జాతీయ అవార్డు గ్రహీత కమల్ కన్నన్ ను రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. మరి 'బాహుబలి'లో గ్రాఫిక్స్ సక్సెస్ సాధించడం వెనుక కమల్ కన్నన్ ఉన్నాడనేది తెలిసిన విషయమే. అన్ని విషయాల్లో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కోసం పనిచేసేందుకు టాప్ టెక్నీషియన్స్ నే వాడాలని నిర్మాత రామ్ చరణ్, చిరంజీవి, డైరెక్టర్ సురేందర్ రెడ్డిలు ఫిక్స్ అయ్యారట.