నేటి యంగ్ హీరోలలో స్టార్‌హోదా తెచ్చుకుని, నేచురల్‌స్టార్‌గా ఎదిగిన నాని ఎవరూ సాధించలేని డబుల్ హ్యాట్రిక్‌ను ఇప్పటికే సాధించాడు. ప్రస్తుతం ఆయన మూడో హ్యాట్రిక్‌కు సిద్దమైపోతున్నాడు. శివనిర్వాణ అనే కొత్త దర్శకునితో దానయ్య నిర్మాతగా 'నిన్నుకోరి' అనే చిత్రం చేస్తున్నాడు. ఎప్పుడో మణిరత్నం తీసిన 'ఘర్షణ' చిత్రంలో ఇళయరాజా, రాజశ్రీల కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ సాంగ్ నుంచి ఈ టైటిల్‌ను ఎంచుకున్నారు. ఈ చిత్రం రొమాంటిక్ లవ్, విరహం, వేదన, బ్రేకప్, ఎంటర్‌టైన్‌మెంట్, మాస్ ఎలిమెంట్స్ అన్ని కలగలుపుకున్న చిత్రంగా అర్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌తో అది తేలిపోయింది.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచుతూ దీనిని దృవీకరిస్తోంది. ఇక ఈ చిత్రంలో నివేదాధామస్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమిళంలో మంచి పేరు తెచ్చుకుని, 'సరైనోడు'లో విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి పాత్ర కూడా ఈ చిత్రంలో చాలా ఇంట్రస్టెంగ్‌గా ఉంటుందని అంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ ట్రైలర్‌లో నాని, నివేధాధామస్, ఆది పినిశెట్టిలు ముగ్గురే కనిపిస్తున్నారు.
అలాగే ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ కూడా మంచి మెలోడీతో అంతకు మించిన సాహిత్యంతో ఓలలాడిస్తున్నాయి. ఈ చిత్రానికి గోపీసుందర్ అందించిన ట్యూన్స్ బాగా ప్లస్‌కానున్నాయని అర్ధమవుతోంది. ఇటీవల కాస్త వెనుకబడిన గోపీసుందర్ ఈ చిత్రంతో సంచలనం సృష్టించి మరలా బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని జులై 7న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.