'రారండోయ్ వేడుక చూద్దాం' తో కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న నాగ చైతన్యకు ప్రేమ కథా చిత్రాలే స్టార్ ని చేశాయి. అయితే ఇప్పటివరకు నాగ చైతన్య చేసిన సినిమాలన్నీ ఒక మోస్తారు హిట్స్ మాత్రమే సాధించాయి. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అనేది ఇంతవరకు చైతూకి దొరకలేదు. ఇప్పుడు 'రారండోయ్...' చిత్రం కూడా 25 కోట్ల క్లబ్బులో చేరగలిగింది కానీ... దాన్ని మించి దాటలేకపోయింది. మరి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో అయినా నాగ చైతన్య బిగ్ సక్సెస్ అందుకుంటాడేమో అని నాగార్జున చాలా ఆశపడ్డాడు. కానీ నాగ చైతన్యకి ఆ స్థాయి హిట్ పడడంలేదు. అందుకే నాగ్ ఇప్పుడొక నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు.
నాగ చైతన్య ని ఎవరన్నా పెద్ద దర్శకుడి చేతిలో పెట్టాలని నాగ్ ఆలోచిస్తున్నాడట. స్టార్ డైరెక్టర్ అయితే నాగ చైతన్యకి భారీ హిట్ ఇస్తాడని ఒక మోస్తారు డైరెక్టర్స్ వల్ల చైతు కెరీర్ గాడిన పడడంలేదని నాగ్ ఈ ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే నాగార్జున నిర్ణయం బాగానే వుంది కానీ.. ఇప్పటికిప్పుడు స్టార్ డైరెక్టర్స్ ఎవరూ నాగ చైతన్యతో సినిమా చెయ్యడానికి రెడీగా లేరు. ఎవరికి వారే తమ తమ కమిట్మెంట్స్ తో బిజీగా వున్నారు. అయినా స్టార్ డైరెక్టర్స్ కూడా హిట్ అయిన హీరోస్ నే రిపీట్ చేస్తున్నారు గాని వేరే హీరోలమీద దృష్టి సారించడంలేదు.
అందులో కొరటాల శివ మళ్ళీ మళ్ళీ మహేష్ తోనే సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యి మహేష్ తో సినిమా పట్టాలెక్కించాడు. ఇక త్రివిక్రమ్ కూడా పవన్ విషయంలోనూ అలానే చేస్తున్నాడు. ఇక స్టార్ హీరోలు కూడా హిట్ దర్శకులను పదే పదే రిపీట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక స్టార్ డైరెక్టర్ ని నాగ చైతన్య సినిమా కోసం దింపుతామంటే నాగ్ కి కష్టమే. కాకపోతే నాగార్జున భారీ ఆఫర్ చేస్తే ఏమన్నా డైరెక్టర్స్ వలలో పడే అవకాశం వుంది.
మరి బెల్లంకొండ సురేష్ తన కొడుకుని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని ఎంతమంది స్టార్ డైరెక్టర్స్ ని బుట్టలో వెయ్యడం లేదు. ఇక హీరోయిన్స్ ని కూడా భారీ పారితోషకం ఆఫర్ చేస్తూ కొడుకు కోసం లాగేస్తున్నాడు. మరి నాగార్జున కూడా ఇలాంటిదేమైనా చేస్తే లాభం ఉంటుందేమో ఆలోచిస్తే బావుంటుంది.