ఇటీవల రాజమౌళి శిష్యరత్నం 'దిక్కులు చూడకురామయ్యా.'అంటూ ఓ ఫ్లాప్ చిత్రం తీశాడు. అదే పాటను వాడుకుంటే.. పైన మనం చెప్పుకున్న హెడ్డింగ్‌లా ఉంటుంది. ఇటీవలే జక్కన్న ఎంతో ఓపెన్‌గా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ప్రోగ్రాంలో తనకు అల్లు అరవింద్ అంటే చాలా కోపమని.. దానికి కారణం నాడు పలు పత్రికల్లో అర్ధశతదినోత్సవాలు, శతదినోత్సవ చిత్రాల సెంటర్ల సంఖ్యలను వేసేవారని, దానిని తాను ఖండించినా, మెగాభిమానుల కోసం అల్లు అరవింద్ అలా చేసి మాట తప్పాడని చెప్పాడు.
దీంతో చాలా మంది అబ్బా.. ఇంత పక్కా కమర్షియల్ డైరెక్టర్‌లో కూడా ఇన్ని ఆదర్శభావాలున్నాయా? అని కొందరు ఆయన్ను తెగమెచ్చుకున్నారు. నిజంగా అలా వేయడం తప్పే.. కారణం అభిమానులు. వారు తమ హీరో చిత్రం ఇన్ని సెంటర్స్‌లో ఆడిందని, కాదు మా హీరో సినిమానే దానికి మించిన సెంటర్స్‌లో శతదినోత్సవం చేసుకుందని వాదనలకు దిగి పెద్ద పెద్ద గొడవలు కూడా అయ్యేవి. దాంతో జక్కన్న అభిప్రాయంతో విశ్లేషకులందరూ ఏకీభవించారు.
ఇక తాజాగా 'బాహుబలి'చిత్రం 50 రోజులకు సంబంధించిన పోస్టర్లలో ఇండియా మొత్తం 1050 థియేటర్లలో తమ సినిమా 50 రోజులు ఆడిందని వేసుకున్నారు. 'బాహుబలి' రెండు పార్ట్‌లు దేశంలో సంచలన విజయం సాధించాయని అందరూ ఒప్పుకుంటారు. సినిమాలోని లోపాలను విమర్శించిన వారు కూడా ఈ చిత్రం అతి పెద్ద హిట్టనే చెబుతారు. కానీ మధ్యలో ఇండియాలో ఇన్ని థియేటర్లలో 50 రోజులు ఆడింది అని పబ్లిసిటీ రాజమౌళి ఎందుకు ఇచ్చాడు? ఇది కూడా జక్కన్న మాట వినకుండా నిర్మాతలే చేశారా? కాదనే చెప్పవచ్చు.
ఎందుకంటే ఇలాంటివి రాఘవేంద్రరావు నుంచి ప్రభాస్ వరకు చివరకు రానా కూడా అంగీకరించడు.అందులోనూ ఈ చిత్ర నిర్మాణంలో జక్కన్న ఓ భాగస్వామి కూడా అనేది చాలా మందికి తెలుసు. కనీసం పాతకాలంలో ఇన్ని సెంటర్స్‌లో అని వేసేటప్పుడు ఆయా సెంటర్ల పేర్లు, థియేటర్ల పేర్లనైనా ప్రకటించేవారు. జక్కన్న అది కూడా చేయలేదు. మొత్తానికి నీతులు ఉన్నవి ఎదుటి వారికి చెప్పడానికే.. మనకు కాదు.. అనే సామెత జక్కన్నకు సరిగా సూట్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.