ఒకప్పుడు శేఖర్‌కమ్ముల అంటే ఓ వర్గం ప్రజలు ఆయన చిత్రం కోసం ఎంతో ఆశగా ఎదురుచూసేవారు. 'ఆనంద్' (ఓ మంచి కాఫీలాంటి చిత్రం)తో ఆయనని ఓ రకం ఆడియన్స్ బాగా ఇష్టపడ్డారు. ఇక జయాపజయాలకు అతీతంగా ఆయన తీసిన 'గోదావరి, లీడర్, హ్యాపీడేస్, లైఫ్‌ఈజ్ బ్యూటిఫుల్' వంటి చిత్రాలను కొందరు బాగా మెచ్చుకున్నారు. కానీ ఆయన ఎప్పుడైతే ఓ బాలీవుడ్ రీమేక్‌ని ఒప్పుకున్నాడో అక్కడే ఆయన అభిమానులు బాధపడ్డారు. అలా తీసిన 'అనామిక' చిత్రం అనామకంగా మిగిలిపోయింది.
సో.. తనకంటే తర్వాత వచ్చిన క్రిష్ వంటి దర్శకుడు ఏకంగా బాలకృష్ణ 100వ ప్రతిష్టాత్మక చిత్రమైన 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి కమర్షియల్ హిట్ కొట్టడంతో ఎంతో కాలం వెయిట్‌చేసి మరలా శేఖర్ తనదైన శైలిలో ఓ ఎన్నారై యువకుడు, తెలంగాణ యువతుల స్టోరీతో దిల్‌రాజు బేనర్‌లో వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా 'ఫిదా' తెరకెక్కిస్తున్నాడు. ఇక 'లోఫర్, మిస్టర్' చిత్రాలను పక్కనపెడితే వరుణ్‌తేజ్ కూడా 'ముకుంద, కంచె' వంటి విభిన్న చిత్రాలకే ఓటు వేస్తున్నాడు. మరోవైపు కథ ఎంతో బాగా ఉంటేనే గానీ చేయని సాయిపల్లవి పెద్ద పెద్ద దర్శకులకు కూడా నో చెప్పింది. ఈ చిత్రం లుక్స్‌లోనే వరుణ్‌తేజ్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ఇక ఈ నెల 17వ తేదీన టీజర్ లాంచ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో తాజాగా ఈ చిత్రం టీజర్ లాంచ్ పోస్టర్‌ని విడుదల చేశారు.
ఇందులో హీరోహీరోయిన్ల వస్త్రధారణ, లొకేషన్, తాను పెట్టుకున్న గోరింటాకును హీరోయిన్ హీరోకు చూపిస్తుంటే, దానిని హీరో ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు. ఈ పోస్టర్ చూసిన వారికి మరోసారి హృద్యమైన ప్రేమకథతో దిల్‌రాజు-శేఖర్‌కమ్ములలు వస్తున్నట్లు అర్ధమవుతోంది. మొత్తానికి ఈ పోస్టర్‌లో ఫీలే అదిరిపోతే మరి సినిమా మరెంత చక్కని ఫిల్టర్ కాఫీలా ఉంటుందో ఊహించుకోవచ్చు...!