తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలపక్కన ఎప్పుడూ తెలుగు హీరోయిన్స్ పనికిరారు. ఎప్పుడూ పరభాష భామల వెనుకే మన స్టార్ హీరోలతోపాటు దర్శక నిర్మాతలు పడతారు. పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్లు ఎప్పుడూ పరభాషా నటీమణులు స్టార్ హీరోల పక్కన నటించి టాలీవుడ్ లో స్థిరపడిపోతుంటారు. ఇక తెలుగులో దొరికిన అరకొర ఆణిముత్యాలు తెలుగు సినిమాల్లో మనలేక పొరుగున ఉన్న తమిళానికి జంప్ అవుతుంటారు.
అయితే ఇప్పుడు మన టాలీవుడ్ లో సగం సినిమాలకు హీరోయిన్స్ కొరత కనబడుతుంది. సినిమాలు మొదలు పెట్టి రోజులు గడుస్తున్నా... ఇప్పటివరకు ఆ సినిమాల్లో హీరోల పక్కన హీరోయిన్స్ సెట్ కాలేదు... అంటే మన హీరో, దర్శక నిర్మాతల మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయో గమనించండి. ఈ ఏడాది మొదట్లో మొదలైన అఖిల్ సినిమా.... మొదలై ఇన్నిరోజులైనా ఇప్పటికి హీరోయిన్ ని సెట్ చేయలేకపోయారు. అలాగే ప్రభాస్ సాహో విషయంలోనూ అదే జరుగుతుంది. సాహో చిత్రంలో ప్రభాస్ పక్కన నటించే అమ్మాయి కోసం ఇంకా తర్జనభర్జనలు పడుతూనే వున్నారు. అలాగే తాజాగా స్టార్ట్ అయిన అల్లు అర్జున్ సినిమా 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' పరిస్థితి కూడా దాదాపు అదే.
మరి ఎప్పుడూ పరభాషా నటీమణుల మీద ఆధారపడే మన దర్శకనిర్మాతలు, హీరోలు ఇప్పుడీ సినిమాల విషయంలో ఇలా ఎందుకు ఉన్నారో అనే ప్రశ్న తలెత్తుతుంది. అయినా ఒక సినిమా ప్లాప్ అయినప్పుడు ఆ సినిమాలో నటించిన హీరోయిన్ కి మరో అవకాశం రావడం చాలా కష్టం. కానీ హీరో వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో నటించడానికి రెడీ అయిపోతాడు. మరి ఈ తేడాలు ఏమిటో అనేది ఎప్పటికి అంతుపట్టని ప్రశ్నే.!!