సల్మాన్ అంటే కాంట్రవర్శీలకు మారుపేరు. ఆయన ఏదోదే మాట్లాడుతూ ఉంటారు. ఒకవైపు ఉత్తరాది వారు దక్షిణాది వారిని తక్కువగా చూస్తున్నారని, దక్షిణాది నటీనటులను, టెక్నీషియన్స్‌ని కేంద్రంలోని ఉత్తరాది వ్యక్తులు తక్కువ చేసి చూస్తున్నారని, దాసరికి దాదా సాహెబ్ ఫాల్కే, ఎస్‌పి బాలుకి పద్మలో అత్యున్నత పురస్కారాలు ఇవ్వడం లేదని, ఒకటి రెండు చిత్రాలకే విద్యాబాలన్ వంటివారికి పెద్ద పెద్ద అవార్డులు లభిస్తున్నాయని మన దక్షిణాది వారు, ముఖ్యంగా పవన్, నారాయణమూర్తి వంటి వారు విమర్శిస్తుంటే తాజాగా సల్మాన్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిని, ఇక్కడి సినీ ప్రేమికులను, నటులను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయి.
'బాహుబలి' అనే చిత్రం బాలీవుడ్ స్టార్స్‌కి కూడా కళ్లు తిరిగిపోయే కలెక్షన్లు సాధించడంతో వారు తమ అహంకారాన్ని, ఇగోను తట్టుకోలేక ఈ విజయానికి ఏవేవో కుంటిసాకులు చెబుతున్నారు. సల్మాన్ వ్యాఖ్యల విషయానికి వస్తే 'బాహుబలి'హిందీలో ఇంతపెద్ద విజయం సాధించడం కేవలం హిందీ ప్రేక్షకుల దయ. భాష ఏదైనా సౌత్ సినిమాలైనా సరే మా ఉత్తరాది వారు ప్రేమిస్తారు. కానీ సౌత్‌లో ప్రేక్షకులు అలా కాదు.. మేమంతా వారికి తెలిసినా కూడా వారు మా సినిమాలు చూడరు. వారి హీరోల చిత్రాలే చూసే సంకుచిత మనస్తత్వం దక్షిణాది వారిది. ప్రభాస్ ఎవరో మా ప్రేక్షకులకు ముక్కు మొహం తెలీదు. కానీ నెత్తిన పెట్టుకున్నారు. ఇక ఉత్తరాది, బాలీవుడ్ ప్రేక్షకుల మరో గొప్పతనం ఏమిటంటే.. నా అభిమానులు కూడా సినిమా బాగుంటే అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ చిత్రాలైనా చూసి ఆనందిస్తారు.
కానీ దక్షిణాది ఫ్యాన్స్ కేవలం వారి అభిమాననటుడి సినిమాలు తప్పితే.. ఎంత బాగున్నా పక్కహీరో చిత్రాలను చూడరు. అదే మా ప్రేక్షకుల గొప్పతనం, వారు నిజమైన సినీ ప్రేమికులు. ఇక ఇక్కడ ఎవ్వరినీ ఎవరూ తొక్కేయరు. కానీ దక్షిణాది వారు అలా కాదు.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు సల్మాన్ ఆలోచనా స్థాయి ఏ పాటిదో చెబుతాయి. దక్షిణాది వారికి హిందీ పెద్దగా రాదు. అయినా సరే 'దంగల్' నుంచి తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు బాగుంటే ఆదరిస్తూనే ఉంటారు. సల్మాన్‌కి జీవితాన్నిచ్చిన 'మైనే ప్యార్ కియా' చిత్రం ఆ రోజుల్లోనే 'ప్రేమపావురాళ్లు' పేరుతో డబ్ అయి ఘన విజయం సాధించింది.
అప్పటికి తెలుగువారికి కూడా సల్మాన్ ఎవరో, ఆయన ముఖం మొహం తెలీదు. ఇక భాగ్యశ్రీ కూడా ఏమీ పరిచయం లేదు. సౌత్‌ఇండియా నుంచి వచ్చిన కమల్, రజినీ, చిరంజీవి, నాగార్జున, వెంకేష్‌ల నుంచి అందరినీ గెంటేసిన ఘనత బాలీవుడ్‌ది. మరి దీనికి నీ దగ్గర సమాధానం ఉందా? సల్మాన్‌ఖాన్..!