ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మేన్‌గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఎన్నో చిత్రాలలో నటించినా, ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివసిస్తూ వస్తున్నా కూడా ఆయన మాట్లాడే తెలుగు వింటే ఎవ్వరికీ నవ్వాగదు. భార్య జీవిత తెలుగమ్మాయి అయినా, ఆయన్ను పెళ్లి చేసుకుని ఇన్నేళ్లు గడుస్తున్నా కూడా తన భర్తకు లైఫ్ ఇచ్చిన తెలుగును మాత్రం నేర్పలేదు. ఎందరో పరభాషా హీరోయిన్లు కూడా నేడు అతి తక్కువకాలంలోనే తెలుగు నేర్చుకుని ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డబ్బింగ్ తామే చెప్పుకోవడంతో పాటు పాటలు కూడా సొంతగా పాడేస్తూ, పక్క హీరోయిన్లకు కూడ డబ్బింగ్ చెప్పే విధంగా తాము నటించి, తమను ఆదరిస్తున్న ప్రేక్షకులను, వారి భాషను నేర్చుకుని ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఒక కె.విశ్వనాథ్ చిత్రం అంటే పాటలు ఎంత శాస్త్రీయంగా, కఠిన పదజాలాలతో ఉంటాయో అందరికీ తెలుసు. ఆయన చిత్రాలలో తెలుగు నటులే నటించి, పాటల్లో లిప్‌మూమెంట్స్ నుంచి డైలాగ్‌లు చెప్పడానికి భయపడతారు. భాషలో, ఉచ్చారణలో చిన్నదోషం వచ్చినా ఆయన ఒప్పుకోడు. తనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చే వరకు నిద్రపోడు...ఆర్టిస్ట్‌లను నిద్రపోనివ్వడు. మరి ఎంతో కళాత్మకం, శాస్రీయమైన కథ, మాటలు, పాటలతో ఆయన తీసిన 'స్వాతికిరణం' చిత్రంలో మమ్ముట్టి నటిస్తే, మలయాళీ అయిన ఆయన తెలుగులో ఏమాత్రం మెప్పించగలడు? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన సమయంలో ఈ చిత్రంలో తానే స్వయంగా తన గొంతుతో డబ్బింగ్ చెబుతానని పట్టుబట్టి మరీ విశ్వనాథ్‌ని ఒప్పించి,ఆ చిత్రంలో మమ్ముట్టి డబ్బింగ్ చెప్పడం విశేషం. కానీ రాజశేఖర్ మాత్రం సినిమాలలో కాదు కదా..! ప్రెస్‌మీట్లో కూడా తెలుగు సరిగా మాట్లాడలేడు. సాయికుమార్, ఘంటసాలరత్నకుమార్, 'అరుంధతి' రవిశంకర్ వంటి వారి సాయంతో బండిని నెట్టుకొచ్చాడు.
ఇక కూతురు శివానిని తెలుగులో కాకుండా తమిళంలో తెరంగేట్రం చేయిస్తామని రాజశేఖర్, జీవిత జంట ప్రకటించారు. తమకు తమిళం... నటులుగా మంచి భవిష్యత్తునిచ్చిందని, తెలుగు కంటే తమిళంలో మంచి చిత్రాలు వస్తాయని, అందుకే హీరోయిన్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చే కోలీవుడ్‌ద్వారానే తమ శివాని ఎంట్రీ ఉంటుందని తేల్చారు. ప్రస్తుతం విశాల్, లింగుస్వామి, గౌతమ్‌మీనన్‌లతో ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారట.