సినిమాకి హైప్ క్రియేట్ చేయడం ఎలా? అనేది తన తండ్రి నుంచి మంచు మనోజ్ కూడా చాలా తొందరగానే నేర్చుకున్నట్లు ఉన్నాడు. సినిమాలో దమ్ములేకపోయినా పబ్లిసిటీతో బండిని లాక్కురావాలని ఆశపడుతున్నాడు. గతంలో 'నేను మీకు తెలుసా' అనే చిత్రం సమయంలో ఇది 'గజిని'ని మించిన వెరైటీ స్టోరీ అని, 'గజిని'తో తమ సినిమాను పోల్చవద్దని మీడియాపై మండిపడ్డాడు.
ఇక 'కరెంట్‌తీగ' కోసం సన్నిలియోన్‌ని అండగా తెచ్చుకుని పబ్లిసిటీ జిమ్మిక్కులు చేశాడు. తానే డ్యాన్స్‌లు కంపోజ్‌చేస్తానని, తానే స్టెప్స్‌కి కొరియోగ్రఫీ అందిస్తానని అంటూ కలరింగ్ ఇచ్చాడు. ఇక పాటలు పాడటం కూడా స్టార్ట్ చేసి తనలోని బహుముఖ ప్రజ్ఞాశాలి ఉన్నాడని నిరూపించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా'లో బాలయ్యని అండగా ఒప్పించాడు. ఇలా మంచు మనోజ్ అనే గొప్ప వ్యక్తి చేయని పబ్లిసిటీ స్టంట్ లేదు.
ఇక తాజాగా 'ఒక్కడు మిగిలాడు' తర్వాత తాను సినిమాలలో నటించనని ట్వీట్ చేశాడు. దాంతో మోహన్‌బాబు, మంచు లక్ష్మిలు క్లాస్ పీకారని అందుకే తాను తన నిర్ణయం విరమించుకున్నానని తన సన్నిహితులకు తెలిపి, తన అభిమానులు, అందరూ బాధపడుతున్నారని, తనకు డైరెక్షన్, ప్రొడక్షన్‌లో ఇంట్రస్ట్ ఉండటంతోనే తాను అలా ట్వీట్‌చేశానని చెప్పి వెంటనే తాను ఇక సినిమాలలో నటించను అనే ట్వీట్‌ను డిలేట్ చేశాడు.
తాజాగా దీనిపై వివరణ ఇస్తూ, తాను నటించే కొత్త చిత్రం ప్రకటించడం కోసం తాను వినూత్నంగా ఆలోచించి అలా ట్వీట్ చేశానని, కానీ దానిని పలువురు పలు విధాలుగా ఊహించుకున్నారని కొత్త భాష్యం చెప్పాడు. టీజర్ రిలీజ్ సమయంలో కేవలం పబ్లిసిటీ స్టంట్ ఇదేనని అర్ధమవుతోంది.