అధికార పక్షాన్ని విమర్శించాల్సిందే. వారు చేస్తున్న తప్పులను, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిందే.కానీ వ్యూహాత్మకంగా మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యతిరేతను తమ వైపుకు తెచ్చుకుని, ప్రజల్లో పాలక పక్షాన్ని దోషిగా నిలబెట్టాల్సింది పోయి.. ఫైర్ బ్రాండ్‌గా పేరొచ్చినంత మాత్రాన నోటికి ఏది వస్తే అది మాట్లాడటం.. చివరకు అవే అధికార పక్షానికి అస్త్రాలుగా దొరకడం వంటివి అనుభవలేమి వల్ల, వ్యూహాత్మక తప్పిదాల వల్లనే వస్తాయి.
కానీ జగన్ మాత్రం తన పార్టీలో మాటల్లో ఎంతో పవర్ చూపించే రోజా, అంబటిరాంబాబు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలకు ఇచ్చినంత ప్రాధాన్యం మైసూరారెడ్డి, కొణతాల, ఆదినారాయణరెడ్డి, ఉండవల్లి, సబ్బంహరి వంటి వారికి ఇవ్వలేదు. దీంతో వైసీపీది వ్యూహం లేని ఎదురుదాడిగా మిగిలిపోయింది. దాంతోనే లగడపాటి వంటి వాడు కూడా జగన్ ప్రతిపక్షనాయకునిగా ఉన్నంతకాలం చంద్రబాబుకు దిగులే లేదని, జగన్‌కి దూకుడు తప్ప వ్యూహం తెలియదని తేల్చేశాడు.
ఇక తాజాగా జగన్ తన పార్టీ వ్యూహకర్తగా చాతుర్యం ఉన్న ప్రశాంత్ కిషోర్‌ని పెట్టుకుని మంచి పని చేశాడు. జగన్ విదేశాల నుంచి తిరిగిరాగానే ప్రశాంత్‌కిషోర్.. రోజా, చెవిరెడ్డిల వల్ల పార్టీకి లాభం లేకపోగా నష్టం చేకూరుతోందని, సరైన ప్రత్యామ్నాయం చూసుకోవాలని సర్వేరిపోర్ట్‌లతో సహా తేల్చిచెప్పాడట. ప్రశాంత్ మాటలను జగన్ కూడా పట్టించుకున్నాడని, ఇక రోజా స్థానాన్ని ఎవరికి అప్పగించాలి? వాగ్దాటితో పాటు వ్యూహాత్మక ప్రసంగాలు చేసి, సామాన్యుల మనసు కొల్లగొట్టే వారెవ్వరూ అనే దానిపై ప్రస్తుతం జగన్ దృష్టిసారించాడు.