'బాహుబలి-ది కన్‌క్లూజన్' తర్వాత ఏ పెద్ద హీరో సినిమా విడుదల కాలేదు. నాగ చైతన్య-రకుల్ ప్రీత్ సింగ్‌ల కాంబినేషన్‌లో నాగార్జున నిర్మించి, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' మాత్రమే మెప్పిస్తోంది. దీంతో పలు చిన్న చిత్రాలు, అవి కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో తెలుగు సినీ ప్రేమికులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఇక దీనినే అదనుగా తీసుకుని అల్లు అర్జున్ - హరీష్ శంకర్ - దిల్‌రాజు - దేవిశ్రీప్రసాద్‌ల కాంబినేషన్‌లో ఈనెల 23న విడుదలకు సిద్దమవుతున్న 'డిజె' (దువ్వాడ జగన్నాథం) పైనే ప్రేక్షకుల ఆశలన్నీ ఉన్నాయి.
వరుస హిట్లుతో దూసుకుపోతున్న బన్నీ నటించిన చిత్రం కావడం, అందునా దిల్‌రాజు వంటి ప్రతిష్టాత్మక నిర్మాత నిర్మిస్తోన్న 25వ ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడం, 'గబ్బర్‌సింగ్' తర్వాత ఆస్థాయి విజయం సాధిస్తాననే కసితో దర్శకుడు హరీష్ శంకర్ ఉండటం, బన్నీ-దిల్‌రాజు-దేవిశ్రీ అంటే ఇరగదీసే ఆస్థాన సంగీత విద్వాంసుడు దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికే దుమ్మురేపుతూ, మరోపక్క ట్రైలర్ కూడా రఫ్ ఆడిస్తుండటంతో పాటు భారీ ఎత్తున రిలీజ్ కానుండటం, బన్నీ బ్రాహ్మణ యువకునిగా, డాన్‌గా రెండు విభిన్నషేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నాడనే ప్రచారంతో ఈ చిత్రం ఇప్పటి నుంచే భారీ అంచనాలను మోసుకొస్తోంది.
ఇక ఒక సినిమా తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి మరో సినిమాను చేపట్టే బన్నీ ఈసారి మాత్రం మనసు మార్చుకున్నాడు. ఆయన తదుపరి నటించే చిత్రం అనౌన్స్‌మెంట్ ఈ నెల 14వ తేదీనే, అంటే 'డిజె' విడుదలకు ముందే జరగనుందని సమాచారం. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్‌లోనే ఈ చిత్రం షెడ్యూల్స్, టైటిల్స్‌ను కూడా ప్రకటిస్తారని సమాచారం. ఇక ఈ చిత్రం ద్వారా బన్నీ వక్కంతం వంశీ అనే స్టార్ రైటర్‌ని దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. దేశభక్తితో కూడిన కథతో ఎంతో కాలంగా ఎన్టీఆర్‌ని నమ్మి మోసపోయానన్న భావనలో ఉన్న వక్కంతం వంశీకి ఈ చిత్రం డు ఆర్ డైగా మారింది.
ఇక ఈ చిత్రానికి మొదట 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' అనే టైటిల్‌ను అనుకున్నారు.కానీ బన్నీ అభిమానుల నుంచి ఏకాభిప్రాయం రాకపోవడం, కేవలం దేశభక్తినే ఈ టైటిల్ సూచిస్తుండటంతో యూనిట్ మొత్తం కలిసి ఈ చిత్రం టైటిల్‌ను చేంజ్ చేశారని, బన్నీ ఈ చిత్రం టైటిల్‌ను కూడా 14వ తేదీనే అఫీషియల్‌గా ప్రకటిస్తాడని తెలుస్తోంది. ఇక 'డిజె' చిత్రంలో పూజాహెగ్డే సరసన నటిస్తోన్న బన్నీ వక్కంతం సినిమాలో కన్నడ నటి రష్మిక మండన్నతో నటిస్తున్నాడని అంటున్నారు.
కాగా 'ఆరెంజ్' ద్వారా పూర్తిగా నష్టపోయి ఇక నిర్మాణం చేయనని చెప్పిన మెగాబ్రదర్, అంజనా ప్రొడక్షన్స్ అధినేత నాగబాబు లగడపాటిశ్రీధర్‌తో కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు. ఇప్పటికే కాశ్మీర్‌తో పాటు పలు లోకేషన్ల వేట కూడా పూర్తై ఫిక్సయింది. వచ్చే ఏడాది సమ్మర్ రేసులోనే చరణ్-సుక్కుల 'రంగస్థలం', మహేష్-కొరటాల 'భరత్ అనే నేను' విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక రిపబ్లిక్ డే కానుకగా '2.0' ఎలానూ ఎప్పటి నుంచో రేసులో ఉంది.