సునీల్‌దత్.. ప్రముఖ గాంధేయవాది. రాజకీయాలలో, సినిమాలలో చురుగ్గా తన పాత్రను నిర్వహించారు. ఆయనంటే కాంగ్రెస్ వారికే కాదు.. బాల్‌థాకరే నుంచి పివి నరసింహారావు, వాజ్‌పేయ్ వరకు నిన్నటితరం వారందరికీ ఇష్టమే. కానీ ఆయనకు నర్గీస్‌కు పుట్టిన సినీ సంచలనం సంజయ్‌దత్ జీవితమంతా కష్టాలే. ముందుగా డ్రగ్ ఎడిక్ట్‌గా మారాడు. చివరకు ఆ వ్యసనాన్ని వదిలి, తన భారీ దేహంలో కండలు తిరిగిన శరీరంతో తనదైన హెయిర్‌స్టైల్, మేనరిజమ్స్‌తో 'ఖల్‌నాయక్'గా పేరు తెచ్చుకున్నాడు.
ఏ క్షణాన ఆయన్ను అభిమానులు ఖల్‌నాయక్ అని ముద్దుగా పిలవడం మొదలుపెట్టారో గానీ ఆయన జీవితం సంచలనాలకు, వివాదాలకు, మరికొందరి తీవ్రమైన, అంతులేని ఆవేదనకు కారణమైంది. 1993లో జరిగిన ముంబై పేల్లుళ్ల సందర్భంగా అక్రమాయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో కోర్టు ఆయనకు జైలు శిక్ష వేసింది. సునీల్‌దత్ చరిత్ర, దగ్గర నుండి సంజయ్‌దత్‌ని చూసిన వారు ఈ ఆరోపణలను నమ్మలేదు. కానీ కోర్టు శిక్ష వేసింది. కానీ ఆయన అమాయకుడే అని బాల్‌థాకరే నుంచి అందరూ మద్దతు తెలిపారు.ఇక సంజయ్‌దత్ జీవితంలో చేసిన పొరపాటు ఏమిటంటే... మిగిలిన ఖాన్ త్రయంలోలాగా తనదైన మనుషులను, పలుకుబడిని సాధించలేదు.
నిజంగా నాడు ఆయన తండ్రి సునీల్‌దత్ తనకున్న పొలిటికల్ పవర్ ఉపయోగించుకుని ఉంటే.. కృష్ణ జింకల కేసు నుంచి డ్రంక్ డ్రైవ్, హిట్ అండ్ రన్ నుంచి పలువురి మరణానికి కారణమైన సల్మాన్ ఖాన్‌లాగా నిర్ధోషిగా హాయిగా జల్సాలు, విందు వినోదాలు ఆనందించేవాడనడంలో సందేహం లేదు. ఒకానొక దశలో ఓ వర్గం, ముఖ్యంగా ఖాన్‌త్రయం పెత్తనానికి ఎవ్వరూ ఎదురురాకుండా చూడటం కోసం సన్నీ జీవితాన్ని నాశనం చేశారని పలువురు నమ్ముతారు. ఈ కేసుకు సంబంధించి ఆయన 2013లో కోర్టులో సరెండర్ అయ్యాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయన ఫిబ్రవరి 2016లో విడుదలయ్యారు.
సత్ప్రవర్తన కారణంగా ఆయనను 8నెలలు ముందుగా విడుదల చేశారు. ఇలా ముందుగా సంజయ్ విడుదల కావడంపై మరలా రాజకీయం మొదలైంది. ఎలా ముందుగా రిలీజ్ చేస్తారంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ని విచారించిన బాంబే హైకోర్టు శిక్షాకాలం పూర్తి కాకుండా ఎనిమిది నెలలు ముందుగా ఎలా పెరోల్‌పై విడుదల చేశారో చెప్పమని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై సమాధానం చెప్పాలని పూణేలోని ఆయన నిర్భంధంలో ఉన్న ఎర్రవాడ జైలు అధికారులను కూడా ప్రశ్నించింది. సంజయ్ జీవితంపై మరలా అరెస్ట్ నీడలు కమ్ముకోవడం, ఆయనను మరలా జైలుకు పంపే అవకాశం ఉండటంతో ఆయనతో సినిమాలు ప్లాన్ చేసిన దర్శకనిర్మాతల్లో మరోసారి టెన్షన్ మొదలైంది.
ఆయన మరలా జైలుకు వెళ్లితే తమకు కోట్లలో నష్టం వస్తుందని ఆయన దర్శకనిర్మాతలు, బయ్యర్లు, ఫైనాన్షియర్లు ఆందోళనలో ఉంటే ఆయన మరలా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే అసలే డిప్రెషన్‌లో ఉన్న ఆయన మరింతగా చితికిపోతాడని ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఆయన ఇటీవలే దేశంలో డ్రగ్స్ బారిన పడిన వారి కోసం ఉచితంగా మందులు, చికిత్సలు అందిస్తున్నాడు. తనకు తన తండ్రి మంచి ఆర్ధిక స్ధితిమంతుడు కాబట్టి తనను ఆయన డ్రగ్స్ బారి నుంచి రక్షించే ఖరీదైన వైద్యం అందించాడని, కానీ ఏ స్థోమతలేని డ్రగ్స్ బాధితులను ఎవరు పట్టించుకుంటారని ఆయన ఉద్వేగభగం చెంది తన ఆస్తులలోని చాలా భాగాన్ని ఆ ట్రస్ట్‌కు రాసిచ్చాడు.
కాగా ప్రస్తుతం సంజయ్‌దత్ జైలుకు వెళ్లితే ప్రస్తుతం ఆయన బయోపిక్‌ని తీస్తోన్న తాను కూడా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయాల్సివస్తుందని రాజ్‌కుమార్ హిర్వాణి కూడా మధనపడుతూ ఆవేదన చెందుతున్నాడు.