'శ్రీమంతుడు' చిత్రంపై ఇప్పుడు కోర్టు కేసులు నడుస్తున్నాయి. నిర్మాతల దగ్గరనుండి, దర్శకుడు, నటుడు మహేష్ వంటి వారిపై కూడా కేసులు ఉన్నాయి. శరత్ చంద్ర అనే వ్యక్తి 'శ్రీమంతుడు' సినిమా కథ తనదని, తాను రాసిన నవలను కాపీకొట్టి తన అనుమతి లేకుండా సినిమా తీశారంటూ ఆ సినిమా హీరో, దర్శక, నిర్మాతలపై కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. స్వాతి వీక్లిలో 2012లో తాను రాసిన 'చచ్చేంత ప్రేమ' నవలను కాపీ చేసి 'శ్రీమంతుడు' సినిమా నిర్మించారని, తన అనుమతి లేకుండా తన నవల ఆధారంగా సినిమా నిర్మించడం కాపీ రైట్ ఉల్లంఘనే అవుతుందంటూ... నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కేసుపై నాంపల్లి కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న నటుడు మహేష్ కూడా హాజరుకావాల్సిందేనని నాంపల్లి కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో తనకు బదులు మరొకరు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలంటూ మహేష్ ఇప్పటి వరకు నాంపల్లి కోర్టును కోరుతూ వచ్చాడు. అయితే మహేష్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఖచ్చితంగా మహేష్ బాబు కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది. అలాగే మైత్రీ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ కోర్టుకు హాజరు కానందుకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక దీంతో విదేశాల్లో ఉన్న ఎర్నేని నవీన్ తప్పక కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి మహేష్ కూడా ఖచ్చితంగా కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది.