ఇటీవల జనసేనాధిపతి పవన్ కళ్యాన్ ఉత్తరాది, దక్షిణాది తేడాపై మండిపడుతున్నారు. ఇక ఆయన బాటలోనే ఈమద్య ఒకరిద్దరు తమిళ నటులు, కన్నడ నటులు గళం విప్పుతున్నారు. ఇటీవలే హీరో సుమన్ కూడా అదే విషయం ప్రస్తావించారు. ఇప్పుడు దాసరికి సినీ పరిశ్రమ చేసిన సంతాప సభలో విప్లవనాయకుడు ఆర్.నారాయణమూర్తి చేసిన ప్రసంగం అందరినీ అబ్బురపరిచి, పవన్ గొంతుకకు తోడుగా నిలబడింది.
ఈ సంతాప సభలో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ, అంబేడ్కర్‌కి కూడా చనిపోయిన తర్వాత భారతరత్న ఇచ్చారు. దాసరి గారికి కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి. దానికోసం అందరం కలిసి ఢిల్లీ వెళ్లి పోరాటం చేద్దాం. విద్యాబాలన్‌కి ఎప్పుడో పద్మ ఇచ్చారు. కానీ మహానాటి సావిత్రికి, ఎస్వీరంగారావుకి, చివరకు బాలసుబ్రహ్మణ్యంకు కూడా పద్మ భూషణ్ ఇవ్వలేదు. ఇండియా అంటే కేవలం ఉత్తరాది మాత్రమే కాదు.. దక్షిణాది కూడా. ఎవడబ్బ సొమ్మని అన్ని ఉత్తరాది వారికే ఇస్తారు? ఈ దేశం అందరిదీ.. ఈ దేశం ఎవడబ్బ సొత్తుకాదు. సినిమా స్క్రీన్‌పై కనిపించాలని, పేపర్లో ఫొటో వేయించుకోవాలని, క్లాప్స్ కొట్టించుకోవాలని మద్రాస్‌కు మా అమ్మ ఇచ్చిన 70రూపాయలతో వెళ్లాను, నేను వెళ్లిన వెంటనే ఎన్టీఆర్, ఏయన్నార్‌లు పిలిచి షేక్ హ్యాండిచ్చి, చాన్స్‌లిస్తారని భావించాను.
కానీ మద్రాస్ వెళ్లిన తర్వాత నాలాంటోళ్లు లక్షల మంది ఉన్నారని తెలిసింది. ఆ డబ్బులు ఖర్చయిపోగానే ట్యాంకులలో నీళ్లు తాగి బతికాను. బలంగా ఉండేవాడిని బలహీనంగా తయారయ్యాను. రాజబాబు గారి మేకప్‌మేన్ సహాయంలో గురువు దాసరి గారిని 'తాతా మనవడు' షూటింగ్‌లో కలిశాను. నాకు అప్పుడు బొమ్మలు గీసే అలవాటుండేది. నేను గీసిన ఏయన్నార్ బొమ్మను దాసరిగారికి చూపించాను. ఆయన భుజం తట్టి ప్రోత్సహించారు. మద్రాస్‌లో మొదటి సారిగా నాపై చేయి వేసి ధైర్యం చెప్పింది ఆయనే. ఏం చదివావు అని అడిగారు. ఇంటర్మీడియట్ సార్ అని చెప్పాను.
డిగ్రీ పూర్తి చేసుకుని రా.. వేషం ఇస్తాను అని మాట ఇచ్చారు. అన్నట్లుగానే అవకాశం ఇచ్చారు. ఈ ఫీల్డ్‌లో ఓ 10కోట్లు ఉంటే హీరో అయిపోవచ్చు. కాబట్టి వారసులు వస్తున్నారు. అందులో తప్పులేదు. కానీ కేవలం డబ్బున్న వారికే గాక మాలాంటి పేదలకు సినిమాలలో నటించే కోరిక ఉంటే వారికి దయచేసి అవకాశం ఇవ్వండి. చదువుల్లో అంబేడ్కర్ ఏ విధంగా రిజర్వేషన్లు తెచ్చిపెట్టారో... మాలాంటి పేదవారికి, కసి ఉన్న నటులకు, దర్శకులకు, టెక్నీషియన్లకు కూడా అవకాశం ఇవ్వండి.
మా గురువుగారు దాసరి ఎలా నాకు కులం, మతం, ప్రాంతం, డబ్బు వంటివి చూడకుండా, నేనెవరో తెలియకపోయినా నాలోని కసిని చూసి అవకాశం ఇచ్చారో.. అందరూ అలాగే మావంటి వారికి అవకాశాలు ఇవ్వడం.. అంటూ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగం అందరినీ ఆకట్టుకుని, ఆర్.నారాయణమూర్తిలోని విప్లవభావాలకు ప్రతీకగా నిలిచింది.