చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కు బ్రేక్ ఇచ్చేసి భార్య తో సహా 80 లలో నటీనటులతో కలిసి చైనా టూర్ కి కూడా వెళ్ళొచ్చేశాడు. అక్కడ బీజింగ్ వంటి మహా నగరంలో ఎంజాయ్ చేసిన చిరు.... భార్యతో సహా ఇప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ అవడమే తడువుగా దాసరి నారాయణ రావు సంతాప సభలో వాలిపోయాడు. దాసరి మరణించినప్పుడు చైనా ట్రిప్ లో వున్న చిరు అప్పుడు తన సంతాపాన్ని దాసరి కుటుంబానికి మీడియా ద్వారా తెలియజేశాడు. అయితే ఇప్పుడు మాత్రం సంతాప సభకు తరలివచ్చి దాసరికి తనకు ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ.... కడసారి ఆయనను చూసే అవకాశం దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తపరిచారు.
అయితే ఆ సభలో చిరంజీవి లుక్ చూసినవారంతా.... ఆయన తనతదుపరి ప్రాజెక్ట్ అయిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' గురించి తన లుక్ ని మార్చాడని అంటున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్‌చరణ్ నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. అయితే ఈ చిత్రం కోసం చిరంజీవి తన లుక్ ని పూర్తిగా మార్చేస్తున్నాడని.... అందుకే ఇలా పెరిగి పెరగని గెడ్డం.... ఓంపుతిరిగిన మీసకట్టుతో కనిపిస్తున్నాడని అంటున్నారు.
ఆగష్టు లో సెట్స్ మీదకెళ్ళబోతున్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం కోసమే చిరు ఇలా తన లుక్ ని మార్చేశాడని.... మెగా ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇది నిజమా?కదా అనేది మాత్రం 'ఉయ్యాలవాడ...' సినిమా లాంచ్ వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. కానీ ఈ లోపు ఈ లుక్ తో ఉన్న చిరు ఫొటోస్ ని మాత్రం మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు.