తాము చేస్తే శృంగారం.. పక్కవారు చేస్తే వ్యభిచారం అనే సామెత ఖచ్చితంగా అల్లుఅరవింద్‌కే దక్కుతుంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. పలు నవలలు, కథలు, ఇతరుల చిత్రాలలోని పాయింట్లను ఎత్తిపోతల పథకం చేసి సినిమాలు తీసే అల్లుఅరవింద్‌కు అందరూ అలాగే కనిపిస్తారు. అసలు 'మగధీర'నే తన నవలకు కాపీ అని ఓ రచయిత పోరాటం చేస్తుంటే సినీ పెద్దలు పట్టించుకోవడం లేదు. కానీ 2000లో వచ్చిన 'మగధీర' చిత్రాన్ని కాపీ కొట్టి 'రాబ్తా' తీశారని అల్లుఅరవింద్ కోర్టులో పిటిషన్ వేయడం తప్పు అని గతంలోనే ముచ్చటించాము.
ఇక కేవలం ఓ చిత్రం ట్రైలర్‌నో, టీజర్‌నో, ఫస్ట్‌లుక్‌నో చూసి గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకున్న చందంగా అల్లువారు కేవలం 'రాబ్తా' ట్రైలర్‌ని చూసి తన చిత్రానికి కాపీ అని కోర్టులో కేసు వేయడం విచారకరం. చివరకు ఆ చిత్ర నిర్మాత, దర్శకులు కూడా కేవలం ట్రైలర్‌ని చూసి స్పందించి తమను ఇబ్బంది పెట్టవద్దని, సినిమా విడుదలైన తర్వాత తాము మీ 'మగధీర'ను కాపీ కొట్టి ఉంటే అప్పుడు కేసు వేసినా, పరువునష్టమో లేక కాపీ రైట్‌యాక్ట్ కేసుతో పాటు ఏ శిక్ష విధించినా తాము సిద్దమేనని, తమ చిత్రం 9వ తేదీన విడుదల అవుతున్ననేపథ్యంలో తమ చిత్రం విడుదలకు అడ్డురావద్దని అల్లువారిని బతిమిలాడినా ఆయన ససేమిరా అన్నాడు. కేవలం ముందుగానే నిర్మాతలకు భయపెట్టి, ఎంతో కొంత గుంజుకోవాలనే ఉద్దేశ్యంతోనే అల్లు వారు ఇలా చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.
చివరకు 'రాబ్తా' నిర్మాతలు, తమ చిత్రాన్ని న్యాయస్థానానికి చూపించి, తమ చిత్రానికి 'మగధీర'కు సంబంధమే లేదని నిరూపించారు. దాంతో అల్లు వారు కేసును వాపస్ తీసుకున్నారు. మరి బన్నీ నటిస్తున్న 'డిజె' ట్రైలర్ కూడా పలు చిత్రాలను పోలి ఉందని వార్తలు వస్తున్నాయి. అంత మాత్రాన పలు చిత్రాల నిర్మాతలు కేవలం ట్రైలర్‌ను చూసి 'డిజె' విడుదలను ఆపాలనుకుంటే ఓ తండ్రిగా అరవింద్ ఎంత బాధపడుతాడు? మరి తనలాంటి వారే కదా పక్కవారు కూడా..! కనీసం ఓ సీనియర్ నిర్మాత, ఎంతో అనుభవం, జ్ఞానం ఉన్న అరవింద్ ఈ విధంగా 'రాబ్తా'ను ఇబ్బంది పెట్టడం ఆయన సంకుచిత మనస్తత్వానికి ఉదాహరణగా చెప్పవచ్చు.