షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఏడాదికి పైగానే జరుగుతోంది. కానీ మురుగదాస్-మహేష్‌బాబుల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'స్పైడర్' గురించి సరైన అప్‌డేట్ లేదు. ఇప్పటికే వచ్చేస్తున్నాం.. వచ్చేస్తున్నాం.. జూన్23 రిలీజ్... శివరాత్రికి టీజర్, జనవరి1న టీజర్ వంటివి ఎన్నో విన్న సినీ ప్రేమికులకు ఇక విసుగు పుట్టే సమయంలో ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. మహేష్ ఫ్యాన్స్ నుంచే గాక అందరి నుంచి చివరకు రాజమౌళి నుంచి కూడా ఈ టీజర్ ప్రశంసలు అందుకుంది. కాగా ఎట్టకేలకు ఈ చిత్రం గురించి డైరెక్టర్ మురుగదాస్ నోరు విప్పాడు.
సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, ఇక కేవలం 10రోజుల షూటింగ్, రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని తెలిపాడు. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయని తేల్చేశాడు. పనిలో పనిగా మహేష్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్ ఓ మంచి అంకిత భావం ఉన్న నటుడే కాదు.. డైరెక్టర్ చెప్పినట్లు వినే ఓ మంచి స్టూడెంట్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఓ సూపర్‌స్టార్‌తో పనిచేస్తున్నాననే భావన నాకు కలగకుండా చూసుకున్నాడు. వినయం, కలుపుగోలుతనం, నిరాడంబరం వంటివి నాకెంతో నచ్చాయి. నాతోనే కాదు.. సినిమా సెట్‌లోని వారందరితో అలాగే ఉంటాడు.. అని ఆకాశానికెత్తేశాడు.
సరే.. ఇవి ప్రతి దర్శకుడు ఓ స్టార్‌తో సినిమాలు చేసేటప్పుడు చెప్పే రొటీన్ భజనే అని చెప్పుకోవాలి. ఆల్‌రెడీ మహేష్‌ను మురుగదాస్ పొగిడేసాడంటే ఇక రాబోయే రోజుల్లో మహేష్ కూడా మురుగదాస్‌పై ఇలాంటి పొగడ్తలే గుప్పించడం ఖాయం. ఇక ఈ చిత్రం సెప్టెంబర్27న విడుదలకానుంది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఠాగూర్ మదు, ఎన్వీప్రసాద్‌లు నిర్మాతలు కాగా హరీష్‌జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం 'స్పైడర్' పేరుతోనే తమిళంలో కూడా ఒకేసారి విడుదల కానుంది. తమిళంలో మహేష్ నటిసున్న తొలి స్ట్రెయిట్ చిత్రం ఇదే కావడం గమనార్హం.