'బాహుబలి' పుణ్యమా అని దేశంలో మరలా భారీ బడ్జెట్ చిత్రాల ఊపు వచ్చింది. తన జీవితకాలంలో 'మహాభారతం'ను భారీ లెవల్లో తెరకెక్కిస్తానని, కానీ అది ఇప్పుడే కాదని రాజమౌళి చెబుతున్నాడు. ఇక 'బాహుబలి' వల్ల జరిగిన మేలు ఏమిటంటే..సినిమాలో దమ్ముంటే ఎంత భారీ బడ్జెట్‌తో నిర్మించినా కూడా లాభాలు రాబట్టుకోవడం సాధ్యమేనని నిరూపితమైంది. దీని ఎఫెక్ట్‌తోనే మోహన్‌లాల్ అండ్ బ్యాచ్ 'రాండామూజం' 1000కోట్లతో రూపొందనుంది. భారీ నటీనటులు లేకపోయినా కేవలం కథ మీద నమ్మకంతో సుందర్.సి 'సంఘమిత్ర' చేస్తున్నాడు.
మరోపక్క ఎలాగూ ఎప్పుడో మొదలైన '2,0' ఉండనే ఉంది. ఇక ఇదే సమయంలో 'మగధీర'వంటి భారీ ప్రాజెక్ట్‌ను తీసి, నాడు టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన మాస్టర్ మైండ్ అల్లుఅరవింద్ మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి రామాయణం తీస్తానని ప్రకటించాడు. కానీ పైన చెప్పుకున్న చిత్రాలలో అధిక భాగం అసలు ఉంటాయా? లేక కేవలం పబ్లిసిటీ కోసం వార్తలేనా? అనే అనుమానం కూడా సామాన్య సినీ ప్రేక్షకులలో కలిగింది. కానీ దానిని పటాపంచలు చేస్తూ 'సంఘమిత్ర' మొదలైంది. త్వరలో అబుదాబిలో మోహన్‌లాల్ చిత్రం మొదటి షెడ్యూల్ జరగనుంది.
ఇప్పుడు అల్లుఅరవింద్ కూడా 'సంపూర్ణ రామాయణం' అనే టైటిల్‌ను ఫిల్మ్‌చాంబర్‌లో రిజిష్టర్ చేసేశాడు. ఇక నటీనటుల ఎంపిక జరుగుతోంది. కొందరేమో రామ్‌చరణ్ రాముడంటూ ఉంటే, మరికొందరు బన్నీ రాముడంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు, తమిళ, మలయాళం, హిందీలలో నిర్మించడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళంలో, మలయాళంలోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా బన్నీకి మంచి క్రేజే ఉంది. ఇటీవల 'సరైనోడు' చిత్రం డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో ఇరగదీసింది. దీంతో బన్నీనే ఆ పాత్రకు ఎంచుకునే అవకాశాలున్నాయనేది మరో వాదన.
ఇక మంచు విష్ణు కూడా భారీబడ్జెట్‌తో తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ 'గరుడ, కన్నప్ప కథ'ల టైటిల్స్‌ని రెన్యువల్ చేయించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ 'సీతారామకళ్యాణం'ను, వారాహి చలన చిత్ర 'సహోదర, తమ్ముడు' టైటిల్స్‌ని రిజిష్టర్ చేయించడం విశేషం.