చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు చాలా మంది స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి, అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆస్థాయిలో ప్రజలను, సినీ ప్రేక్షకులను అలరించి, మెగాస్టార్‌గా వెలుగొందుతున్న అతను చరిత్ర సృష్టించడం ఖాయమని భావించారు. కానీ ఒకవైపు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హవా, మరోవైపు బలమైన ప్రతిపక్షనేతగా టిడిపి చంద్రబాబునాయుడు వంటి ఇద్దరు హేమాహేమీలు రంగంలో ఉండటం, ఎన్టీఆర్ టిడిపిని స్థాపించిననాటి పరిస్థితులు లేకపోవడం, నాటి రాజకీయ అనిశ్చితి, రాజకీయ శూన్యత లేకపోవడం వంటి పలు కారణాల వల్ల ఆయన కనీసం సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకొక ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయాడు. ఇక పార్టీని కొనసాగించడం ఎంత కష్టమో అర్ధమయ్యే సరికి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు.
ఇది ఆయనకు ఓట్లు వేసిన ఎందరినో బాధించింది. కాంగ్రెస్‌ను ప్రచారంలో ఓ ఆటాడుకుని, చివరకు సోనియా కాళ్ల దగ్గర తన పార్టీని తాకట్టుపెట్టడం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. ఇక ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ ఎంపీ పదవి, కేంద్రమంత్రి పదవి దక్కాయి. తదనంతర ఎన్నికల్లో రాష్ట్రవిభజన కారణంగా కాంగ్రెస్ ఏపీలో, దేశంలో నామరూపాలు లేకుండాపోయింది. దీంతో ఆయన కేవలం ఎంపీగానే మిగిలిపోయారు. అయినా తదనంతర కాలంలో తన తమ్ముడు పవన్ జనసేన స్థాపించి, కాంగ్రెస్ హఠావో నినాదంతో బిజెపి-టిడిపిలకు మద్దతు పలికాడు. ఇప్పుడు ప్రత్యేకహోదా విషయంలో వారితో కూడా తెగదెంపులు చేసుకున్నాడు. కనీసం ట్విట్టర్ ద్వారా అయినా పవన్ తన ఉనికిని చాటుతున్నాడు. కానీ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయంలో చిరంజీవి మాత్రం మౌనముద్ర వీడటం లేదు.
అసలు ఆయన ఇంకా కాంగ్రెస్‌లో ఉన్నాడా? లేక కొంతకాలం ఎంపీ పదవి ఉంటుంది కాబట్టి అప్పటివరకు మౌనంగా ఉండి, తర్వాత పూర్తిగా రాజకీయాల నుండి సన్యాసం పుచ్చుకుంటాడా? తన తమ్ముడు జనసేనకు మద్దతు ఇస్తాడా? రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బిజెపిని, టిడిపిని ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో నిలదీస్తుంటే, చివరకు తన తమ్ముడు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తే చిరు అసలు ఎందుకు స్పందించడం లేదు? ఆయనకు రాజకీయాలపై ఏహ్యత ఏర్పడిందా? ఏపీ కాంగ్రెస్ చేపట్టిన ప్రజాబ్యాలెట్ నుంచి ఏ కార్యక్రమంలోనూ ఆయన ఎందుకు పాలుపంచుకోవడం లేదు? ఏ సభలు, సమావేశాలకు ఎందుకు హాజరుకావడం లేదు? స్వయంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గుంటూరులో జరిపిన ప్రత్యేకహోదా మీటింగ్‌కు కూడా ఎందుకు హాజరుకాలేదు? వంటి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే చిరు నోరు విప్పాల్సిందే.
కానీ చిరు మాత్రం ప్రతి విషయాన్ని బయటకుచెప్పే వ్యక్తికాదు. తనలోని భావాలను తనలోనే దాచుకుంటూ ప్రశ్న వేసినా నవ్వుతూ దాటేస్తాడు. ఇక ఏపీలో కాంగ్రెస్ గెలుస్తుందా? లేదా? అన్న విషయాలను పక్కనపెడితే నిన్నటిదాకా సీఎం అభ్యర్థి చిరునే అని భావించారు. కానీ నేడు రఘువీరారెడ్డే ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రచారం జరుగుతోంది. మరి చిరు మౌనం వెనుక రహస్యం ఏమిటి...?