సౌందర్య రజనీకాంత్.. ఈమె పేరు చెబితే హీరోలకు, నిర్మాతలకు, బయ్యర్లకు కూడా వణుకు. 'రోబో' వంటి పెద్ద హిట్ తర్వాత తన తండ్రి రజనీకాంత్‌ని పట్టుబట్టి, తనకున్న గ్రాఫిక్ డిజైనింగ్ అనుభవంతో రజనీ, దీపికాపడుకొనే వంటి వారితో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఓ కార్టూన్ ఫిల్మ్ వంటి చిత్రం తీసింది. అదే 'కొచ్చాడయాన్' (విక్రమసింహ). ఇక ఈ చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. రజనీని నిలువునా ముంచిన చిత్రం ఇది.
ఈసారి తన సోదరి భర్త ధనుష్‌ని హీరోగా పెట్టుకుని, ధనుష్ కెరీర్‌లోనే పెద్ద హిట్టయి, అతి తక్కువ బడ్జెట్‌తో కోట్లు కొల్లగొట్టిన 'విఐపి'కి సీక్వెల్‌కి దర్శకత్వ బాధ్యతలను చేపట్టింది. 'విఐపి' తెలుగులో ధనుష్‌కు ఉన్న ఏకైక హిట్ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం 'రఘువరన్ బిటెక్'గా వచ్చి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఇక 'విఐపి2'లో మొదటి పార్ట్‌లో ఉన్న క్యారెక్టర్లకే కొనసాగింపు ఉంటుంది. అందునా ఇందులో బాలీవుడ్ నిన్నటితరం స్టార్ హీరోయిన్ కాజోల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. పూర్తిగా విలన్ కాకపోయినా ధనుష్‌ను దెబ్బకొట్టడానికి చూసే బడా పారిశ్రామికవేత్తగా కనిపిస్తోంది.
వి.క్రియేషన్స్ బేనర్‌లో కళైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ మాత్రం అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని జులై 28న విడుదల చేయాలని భావిస్తున్నారు. మొదటి భాగంలో బిటెక్ స్టూడెంట్ ఉద్యోగం లేని బాధలను, తల్లి సెంటిమెంట్‌ను రంగరించారు. మరి రెండో భాగంలో కథ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. ఇక తన తండ్రిని ముంచిన సౌందర్య, కనీసం తన బావనైనా గట్టున పడేస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది....!